బంగ్లాదేశీలపై ఎన్‌ఐఏ నిఘా

9 Nov, 2023 01:06 IST|Sakshi
అక్రమ వలసదారులపై ఎన్‌ఐఏ దృష్టి

బనశంకరి: బెంగళూరు నగరంలో వివిధ ప్రాంతాల్లో పెద్దఎత్తున నివసిస్తున్న అక్రమ బంగ్లాదేశీ వలసదారులపై ఎన్‌ఐఏ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి 8 మందిని అరెస్ట్‌చేశారు. వలసదారులు అక్రమంగా మకాం వేసి, ఆధార్‌ తదితర గుర్తింపు కార్డులను పొందుతున్నారని సమాచారం అందడంతో ఎన్‌ఐఏ అధికారులు 15కు పైగా ప్రదేశాల్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి సోదాలు ప్రారంభించారు. అక్రమ బంగ్లా వలసదారులు, మానవ అక్రమ రవాణా, ఉగ్రవాద కార్యకలాపాల్లో భాగస్వామ్యం కేసుల్లో కూడా ఈ సోదాలు సాగాయి. 15 ఎన్‌ఐఏ బృందాలు సూలదేవనహళ్లి, కృష్ణరాజపురం, బెళ్లందూరుతో పాటు 15 కు పైగా ప్రాంతాల్లో దాడిచేసి పరిశీలించారు.

ఉగ్రవాదానికి సహకారం

బంగ్లాదేశ్‌ నుంచి వేలాది మంది అక్రమంగా ఉద్యాననగరికి వలసవచ్చి తమది పశ్చిమ బెంగాల్‌గా చెప్పుకుంటూ, అనేక రంగాలలో పనిచేస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు తోడ్పాటునిస్తున్నారని ఆరోపణ ఉంది. కొందరు ఉద్యోగాల పేరుతో బంగ్లాదేశీయులను రప్పించి వారికి ఉగ్రవాద శిక్షణ అందించి దుశ్చర్యలకు వినియోగిస్తున్నట్లు కేసులు నమోదయ్యాయి. కానీ రాజకీయ నేతలు వీరిని ఓటుబ్యాంక్‌గా చూడడం వల్ల వారిపై ఎవరూ ఎక్కువగా దృష్టి సారించలేదు. వలస కూలీలు కొందరు చోరీలు, దోపిడీలు, వ్యభిచార ముఠాల నిర్వహణలో పాల్గొంటూ దొరికిపోయారు. కాగా, ఎన్‌ఐఏ అరెస్టు చేసినవారిని విచారణ చేపట్టారు.

బెంగళూరులో మమ్మరంగా సోదాలు

8 మంది అరెస్టు

మరిన్ని వార్తలు