రూ.5 లక్షల అప్పు.. కోటికి నోటీసు

9 Nov, 2023 08:17 IST|Sakshi

శివమొగ్గ: లక్షల రూపాయలు అప్పు తీసుకుంటే వడ్డీలు వేసి దానిని కోట్ల రూపాయలుగా చూపి రైతు ఇంటి జప్తునకు బ్యాంకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ చర్యను ఖండిస్తూ బుధవారం శివమొగ్గ నగరంలో బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం ఎదుట రాష్ట్ర రైతు సంఘం రాష్ట్రాధ్యక్షుడు హెచ్‌ఆర్‌ బసవరాజప్ప నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. బసవరాజప్ప మాట్లాడుతూ రైతు కుపేంద్రప్ప హొళలూరులో ఓ బ్యాంకులో ఇంటి మరమ్మత్తులు, సేద్యం, ట్రాక్టర్‌ కొనుగోలు తదితరాల కోసం రూ. 9.52 లక్షల మేర అప్పులు చేశాడని తెలిపారు.

ఇందులో రూ. 4.50 లక్ష మేర తిరిగి చెల్లించినట్లు తెలిపారు. మిగిలిన రూ. 5 లక్షలకు వడ్డీ, చక్రవడ్డీలు కలిపి రూ. 1.1 కోట్లు కట్టాలని బ్యాంకు అధికారులు తాజాగా నోటీసులు పంపారు. రైతు కుపేంద్రప్ప అనారోగ్యంతో మంచం పట్టాడని, ఆయన భార్య కూడా మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, ఇంట్లో 90 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ఇంటిని జప్తు చేయడం సరికాదన్నారు. కుపేంద్రప్ప బ్యాంకు రుణం తీర్చేందుకు సిద్ధంగా ఉన్నాడని, అయితే బ్యాంకు అధికారులు సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎంపీ బీవై రాఘవేంద్ర అక్కడికి చేరుకుని రైతు మనవిని ఆలకించి అధికారులతో మాట్లాడుతానని హామీనిచ్చారు.

 

మరిన్ని వార్తలు