మూడు రోజుల్లో పెళ్లి.. వరుని ఇంట్లో వధువు మృతి

21 Nov, 2023 12:46 IST|Sakshi

కర్ణాటక: పెళ్లిపత్రికలు పంచారు, వధూవరుల ఇళ్లలో పెళ్లి సందడి నెలకొంది, ఇంతలోనే ఘోరం జరిగింది. తాలూకాలోని టీబీ డ్యాం వద్ద మరో మూడు రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువతి అనుమానాస్పదరీతిలో శవమైన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు..టీబీ డ్యాం నివాసి ఐశ్వర్య (26) అనే యువతి వరుని ఇంట్లో విగతజీవిగా మారింది. వివరాలు.. అశోక్‌ (27), ఐశ్వర్య ఇద్దరు టీబీ డ్యాం వాసులు కాగా ఐదారేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ఇద్దరు వేర్వేరు కులాల వారు అయినప్పటికీ పెద్దల అంగీకారంతో పలు షరతుల ప్రకారం వివాహానికి సిద్ధమయ్యారు. తమ సంప్రదాయ ప్రకారం పెళ్లాడదామని ఐశ్వర్యను వరుడు తీసుకెళ్లాడని, తమ తరఫు నుంచి ఎవరూ రావద్దని చెప్పారని అమ్మాయి బంధువులు తెలిపారు. ఇంతలో యువతి ఆత్మహత్య చేసుకుందని హఠాత్తుగా కట్టుకథ అల్లుతున్నారని ఆరోపించారు.

ఇది హత్యే: యువతి తండ్రి
వారితో మనకు పొసగదని, ఈ పెళ్లి వద్దు అని మా కూతురికి చెప్పాం. ఆమె చాలా దృఢమైన మనస్సు గలది. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు, యువకుడి కుటుంబ సభ్యులే ఈ హత్యకు పాల్పడ్డారని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. యువతి తండ్రి సుబ్రమణి మాట్లాడుతూ ఇద్దరూ ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెళ్లి వద్దని నేను వారించినా, కూతురు, బంధువులు ఒప్పుకోలేదు, 15వ తేదీన ఆమె అమ్మమ్మ ఇంట్లో పూజలు చేయడానికి పంపించాము.

16వ తేదీన అశోక్‌ ఇంటికి తీసుకెళ్లారు. సోమవారం మధ్యాహ్నం ఫోన్‌ చేసి మీ కూతురు చనిపోయిందని చెప్పారు. అంతకుముందే వారు రెండు ఆస్పత్రులకు ఆమెను తీసుకెళ్లారు. ఎలా చనిపోయిందో తెలియదు అని వాపోయారు. అశోక్‌ కుటుంబమే హత్య చేసిందని అన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి వరున్ని అరెస్టు చేశారు.

 

మరిన్ని వార్తలు