-

అన్నమయ్య పుణ్యారాధన

28 Nov, 2023 01:26 IST|Sakshi
వినతిపత్రం సమర్పిస్తున్న కార్మికులు

రాయచూరు రూరల్‌: జిల్లాలోని మాన్వి తాలూకాలో మహోయోగి అన్నమయ్య పుణ్యారాధన కార్యక్రమాలు జరిగాయి. ఆదివారం సాయంత్రం మాన్వి కొండపై వెలసిన బృహన్మఠంలో మాజీ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నాగయ్య, వెంకటేష్‌ స్వామీజీలు విగ్రహానికి రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, బిల్వార్చన, కుంకుమార్చన, పుష్పార్చన నెరవేర్చారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.

బకాయి వేతనాలు చెల్లించరూ..

రాయచూరు రూరల్‌: సాంఘీక సంక్షేమ శాఖ హాస్టళ్లలో విధులు నిర్వహించే కాంట్రాక్ట్‌ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న బకాయి వేతనాలను చెల్లించాలని హాస్టల్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల సంఘం జిల్లాధ్యక్షుడు భీమణ్ణ డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడారు. ఏడు నెలల వేతన బకాయిలను చెల్లించాలన్నారు. పీఎఫ్‌, జీపీఎఫ్‌, సేవా భద్రత లేదని, గత 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న తమను పర్మినెంట్‌ చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.

సమసమాజ నిర్మాణమే ధ్యేయం

రాయచూరు రూరల్‌: స్వార్థాన్ని వీడి బలిష్ట సమాజ నిర్మాణమే ధ్యేయంగా ప్రతిఒక్కరూ పాటుపడాలని విశ్రాంత హెడ్‌మాస్టర్‌ రామణ్ణ అన్నారు. ఆదివారం సాయంత్రం వీరశైవ కళ్యాణ మంటపంలో కళా సంకుల సంస్థ ఏర్పాటు చేసిన కర్ణాటక అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేడు ప్రతి ఒక్కరిలో ద్వేషం, కక్ష, అసూయలు పెరిగాయన్నారు. కేవలం స్వార్థం అధికమైందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, విద్యా, సంగీత రంగాలకు చేసిన సేవలను గుర్తించి సన్మానించడం అభినందనీయమన్నారు. సమావేశంలో సుకృత నాగ్‌, పవిత్ర రెడ్డి, మేఘనాథ్‌, మాలతీ గౌడ, కసాప జిల్లాధ్యక్షుడు రంగణ్ణ, కల్పన, దేవేంద్రమ్మ, సంస్థ అధ్యక్షురాలు రేఖ, మారుతిలున్నారు.

రాజ్యాంగాన్ని గౌరవించాలి

కేజీఎఫ్‌: దేశంలో జన్మించిన ఎవరైనా రాజ్యాంగాన్ని గౌరవించాలని అంబేడ్కర్‌ యువ వేదిక సంస్థాపక అధ్యక్షుడు జైభీమ్‌ శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం బేతమంగల బస్టాండు వద్ద అంబేడ్కర్‌ ప్రతిమకు మాలార్పణ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాజ్యాంగం వల్ల దేశంలోని ప్రతి పౌరుడికి రక్షణ, స్వతంత్ర జీవితం సాగించే స్వేచ్ఛ లభించిందన్నారు. రాజ్యాంగంలో కల్పించిన హక్కులతోనే ప్రతి ఒక్కరు సమాజంలో శాంతియుత జీవితం సాగిస్తున్నారన్నారు. రాజ్యాంగాన్ని అగౌరవ పరిచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గోవింద్‌, తాలూకా అధ్యక్షుడు పవన్‌ రెడ్డి, సుధా, ఉదయ్‌, సంజు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు