ఘరానా నేపాలీ ముఠాకు సంకెళ్లు

29 Nov, 2023 01:28 IST|Sakshi

బనశంకరి: నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌ సహోదరుడు పారిశ్రామికవేత్త భ్రమరేశ్‌ ఇంట్లో భారీ చోరీ కేసును మహాలక్ష్మీలేఔట్‌ పోలీసులు ఛేదించి ముగ్గురు మహిళలతో పాటు 7మంది నేపాలీ గ్యాంగ్‌ను అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 40వేల నగదు, రూ.1.53 కోట్ల విలువచేసే 3.01 కేజీల బంగారు ఆభరణాలు, 562 గ్రాముల వెండి వస్తువులు, 16 ఖరీదైన గడియారాలను స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ బీ.దయానంద్‌ తెలిపారు. మంగళవారం కేసు వివరాలను ఆయన వెల్లడించారు. నేపాల్‌కు చెందిన ఉపేంద్ర బహద్దూర్‌, రాణా బహద్దూర్‌, శాకేంద్ర బహద్దూర్‌ షాహి, కోమల్‌ షాహి, స్వస్తిక్‌ షాహి, పార్వతి షాహి, శాదిల్‌ షాహి అనేవారితో కూడిన ముఠాను అరెస్టు చేశారు భ్రమరేశ్‌ మహలక్ష్మీలేఔట్‌ 7వ మెయిన్‌ రోడ్డు నాగపుర ఇంటికి తాళం వేసుకుని కుటుంబసమేతంగా అక్టోబరు నెలలో యూరప్‌ పర్యటనకు వెళ్లారు. ఈ సమయంలో ఆ ఇంటి పక్కనే నిర్మాణంలో గల కట్టడంలో పనిచేసే నేపాలీ ముఠా దోపిడీకి పథకం వేసింది. ఇంటి కిటికీ ఊచలు విరిచి చొరబడి సుమారు 5 కిలోల బంగారు ఆభరణాలు నగదు దోచు కెళ్లారు. అక్టోబరు 30 తేదీన విదేశీపర్యటన ముగించుకుని ఇంటికి చేరుకున్న భ్రమరేశ్‌ ఇంట్లో చోరీని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తుచేపట్టి నేపాలీ గ్యాంగ్‌ను అరెస్ట్‌చేసి నగదు, బంగారు ఆభరణాలు, చేతిగడియారాలు స్వాధీనం చేసుకున్నారు.

రూ.40 కోట్లు దోచిన సైబర్‌ ముఠా అరెస్టు

ఆన్‌లైన్‌ ద్వారా పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వివిధ టాస్కుల పేరుతో డబ్బు పెట్టుబడిగా పెట్టించుకుని వంచనకు పాల్పడిన నలుగురు మోసగాళ్లను మంగళవారం ఈశాన్య విభాగ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, ల్యాప్‌టాప్‌ ఇతర వస్తువులను కమిషనర్‌ దయానంద్‌ పరిశీలించి మాట్లాడారు. నిందితులు ఇబ్రహీం, మహమ్మద్‌ కలీముల్లా, సయ్యద్‌ యూనస్‌, సయ్యద్‌ అబ్రాజ్‌ అనే నలుగురు పట్టుబడగా, వీరికి చెందిన 30 బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్‌ చేసి రూ.60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 4 మొబైల్స్‌, బ్యాంకు పాస్‌బుక్స్‌, 6 డెబిట్‌ కార్డులు, సిమ్‌కార్డులు, ల్యాప్‌టాప్‌లు, కారు, రెండు బైకులు, బంగారు ఆభరణాలను సీజ్‌ చేశారు. ఈ ముఠా ప్రజల నుంచి రూ.40 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు దర్యాప్తులో తెలిసింది. ఈ ముఠా మోసాలపై దేశవ్యాప్తంగా 315 కు పైగా కేసులు నమోదైనట్లు తెలిపారు.

ఇటీవల పారిశ్రామికవేత్త ఇంట్లో

5 కేజీల బంగారం, సొత్తు అపహరణ

3 కేజీల పసిడి రికవరీ

సీజ్‌ చేసిన ల్యాప్‌టాప్‌లు, కారు, ద్విచక్రవాహనాలు

మరిన్ని వార్తలు