ఆటో వ్యథ గురించి ఎవరిని కదిలించినా కన్నీటి సుడులే

23 Jul, 2022 13:58 IST|Sakshi

తల్లడిల్లి మృత్యువాత పడితే కడచూపునకు నోచుకోని వైనం

అడవిలోకి వెళ్లి అందరూ చావాలనుకొని ఆటోలోనే నిర్ణయం

గువ్వల చెరువు ఘాట్‌లో మృతదేహాలకు సంబంధించి కుటుంబీకుల వ్యథ

సాక్షి రాయచోటి:  పురిటి కష్టం ఒకరిది.. కడచూపునకు నోచుకోలేని దౌర్భాగ్యం మరొకరిది..కళ్లెదుటే రక్త బంధం తెగిపోయి కదల్లేని పరిస్థితుల్లో ఉన్నా దుఃఖించలేని దైన్యం.  కళ్ల ముందే బతికున్న మనుషులు అలా రాలిపోతుంటే.. వారిని రక్షించుకోలేక లోలోపల కుమిలిపోయిన చిత్రమైన  పరిస్థితి. జలమే గరళమై కాటేస్తున్న వేళ.. ఆపద సమయంలో ఆసుపత్రి గుమ్మం తొక్కితే.. కార్డులు లేవని చికిత్సకు వెనుకడుగు వేసిన దౌర్భాగ్య స్థితి. ఒక్కొక్కరుగా ఆటోలో ప్రాణాలు పోతుంటే.. ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో అందరూ కలిసి అడవిలోకి వెళ్లి మూకుమ్మడిగా చనిపోవాలని నిర్ణయం తీసుకున్న నిరుపేదలు వారు. కలుషిత నీటి ప్రభావానికి విరేచనాలు, వాంతులు ఎడతెరిపి లేకుండా సాగిన జీవన పయనం వారి కుటుంబాలను విచ్ఛిన్నం చేసింది. ఆటో వ్యథ గురించి ఎవరిని కదిలించినా కన్నీటి సుడులు తిరుగుతున్నాయి.  

పోలీసు అధికారులకు ఎస్పీ అభినందన 
ఈ కేసు దర్యాప్తును సమగ్రంగా చేపట్టిన కడప డీఎస్పీ బి. వెంకటశివారెడ్డి, దిశ డీఎస్పీ ఆర్‌. వాసుదేవన్, ఫ్యాక్షన్‌జోన్‌ డీఎస్పీ చెంచుబాబు, సీఐలు ఎం. నాగభూషణం, సత్యబాబు, శ్రీరామశ్రీనివాసులు, చిన్నచౌక్‌ సీఐ కె. అశోక్‌రెడ్డి, రిమ్స్‌ సీఐ యు. సదాశివయ్య, విఎన్‌ పల్లి ఎస్‌ఐ రాజారమేష్, వల్లూరు ఎస్‌ఐ విష్ణువర్దన్, కడప టూటౌన్‌ ఎస్‌ఐ ఆర్‌. రాఘవేంద్రారెడ్డి, చింతకొమ్మదిన్నె ఎస్‌ఐ బి. అరుణ్‌రెడ్డి, సిద్దవటం ఎస్‌ఐ తులసీనాగప్రసాద్, దిశ ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి, సైబర్‌ విభాగం ఎస్‌ఐ మధుమల్లేశ్వర్‌ రెడ్డిలను ఎస్పీ అభినందించారు.ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లకు నగదు రివార్డులు అందజేశారు.  

ఆటోలోనే ప్రసవం.. అంతలోనే మరణం  
నా పేరు నాగులయ్య.. మృతి చెందిన భారతి భర్తను. మాకు నలుగురు పిల్లలు. మేము గుల్బర్గా సమీపంలోని జిల్లేడుపల్లెలో ఉండగానే కలుషిత నీటి ప్రభావంతో విపత్కర పరిస్థితి తలెత్తింది.  సొంతూరికి వెళితే  చూపించుకోవచ్చన్న ఉద్దేశంతో కర్ణాటక రాష్ట్రం నుంచి బయలుదేరాం. మహబూబ్‌నగర్‌ జిల్లా ఆలంపూర్‌ సమీపంలోకి రాగానే నా భార్య నడుము నొప్పివస్తోందని చెప్పింది. అదే అమె అన్న చివరి మాట. ఆమె నిండు గర్భిణీ.. విరేచనాలు, వాంతులు అవుతుంటే తల్లిడిల్లిపోయింది. మరోవైపు పురిటి నొప్పులు కూడా అప్పుడే వచ్చినట్లు ఉన్నాయి. కొద్దిసేపటికే ఆటోలోనే నా భార్య ప్రసవం.. బిడ్డ జననం..తర్వాత భార్యబిడ్డ మరణం చూసి తట్టుకోలేకపోయా. వాంతులు, విరేచనాలతో కనీసం ఏడ్చేశక్తి కూడా లేదు.  

భర్త, నాన్నలను కోల్పోయిన లక్ష్మిదేవి   
ఈమె పేరు లక్ష్మిదేవి. చనిపోయిన చెంచురామయ్యకు భార్య.. వీరికి పిల్లలు లేరు. ఈమె చెల్లెలు, బావ చనిపోవడంతో వారి  ఒక్కగానొక్క పాపను తీసుకొచ్చి పెంచుకుంటోంది. ఈ కోవలో దేవుడు మరోమారు ఆ కుటుంబంలో మరణ శాసనం రాశారు. ఒకేసారి తండ్రి చెంచయ్యతోపాటు భర్త చెంచురామయ్యలు ఆటోలోనే ప్రాణం విడిచారు. తమ్ముడు శివయ్య కూడా అస్వస్థతకు గురయ్యాడు. ఆటోలో ఒకపక్క నాన్న, మరో పక్క భర్త చనిపోయిన క్రమంలో ఏడవటానికి కూడా శక్తిలేదని, విరేచనాలతో తిండిలేక నీరసించిపోయినట్లు  లక్ష్మిదేవి భోరున విలపిస్తోంది. 

ఏదో ఒక దారి చూపించండి..   
దాదాపు 20ఏళ్లుగా కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి కట్టెలు కొట్టి బొగ్గులు అమ్ముతున్నాం. అయితే ఆ రోజు మా కమారడు శివ పరిస్థితి విషమంగా ఉంది. మహబూబ్‌ నగర్‌లో చూపించాం.  కొంత రికవరీ అయ్యాడు. తర్వాత ఆసుపత్రుల చుట్టూ    తిరుగుతూ.. వైద్య సేవలు పొందుతూ.. మాత్రలు మింగుతూనే ఇంటికి వచ్చాం.  ఆటోలో  వస్తున్న సమయంలో డ్రైవింగ్‌ కూడా చేయలేకపోయానని బసవయ్య గొల్లుమన్నాడు. చంటి బిడ్డలతో ఉన్న నాలుగైదు కుటుంబాలకు సంబంధించిన తమ వద్ద చిల్లిగవ్వ కూడా లేదు.. అధికారులు, మానవతావాదులు ఆదుకోవాలి.       
– బసవయ్య(మేస్త్రీ), రాయచోటి  

అడవిలోకి వెళ్లి అందరం చనిపోవాలనుకున్నాం... 
మేం కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా ప్రాంతం జిల్లేడుపల్లె ప్రాంతం నుంచి బయలుదేరాక అందరి పరిస్థితి ఇబ్బందిగా మారింది. ముందుగా కర్ణాటక రాష్ట్రంలోని పలు ఆసుపత్రులకు వెళ్లాం..   కార్డులు లేకపోవడంతో వైద్యం చేయమని తిప్పి పంపారు. తెలంగాణా రాష్ట్రం దాటి వచ్చేసరికి ఆటోలో ఒకరిద్దరు చనిపోయారు. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచక అందరం అడవిలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. బతికితే బతుకుతారు.. లేకుంటే మూకుమ్మడిగా అందరం చనిపోవాలనుకున్నామని ఆవేదనతో చెప్పాడు.   
శివయ్య

కడచూపు దక్కలేదు   
ఈ ఫొటోలో కనిపిస్తున్న భార్యాభర్తల పేర్లు మల్లయ్య, వెంకటరమణమ్మ. వీరికి ఐదుగురు పిల్లలు. కలుషిత నీటి ప్రభావం అందరి కంటే ముందుగా వీరి కుమార్తె అమ్ములుపై పడింది. తాగిన ఒక్కరోజులేనే వాంతులు, విరేచనాలు చేసుకుంటూ అస్వస్థతకు గురైంది. చిన్నపాటి మందులు తీసుకొని ఆటోలో పిల్లలతో కలిసి బయలుదేరగా.. 4వ తేదీ కర్నూలు సమీపంలోకి రాగానే అమ్ములు పరిస్థితి విషమించింది. కర్నూలుకు 15కిలోమీటర్ల దూరం ఉండగా అంబులెన్స్‌కు ఫోన్‌ చేయగా.. 108 వాహనం వచ్చింది. అందులో అమ్ములు, వెంకటరమణమ్మను మల్లయ్య ఆసుపత్రికి తీసుకెళ్లారు. అదేరోజు రాత్రి 7గంటల సమయంలో అమ్ములు(6) చనిపోయింది.    బిడ్డను చూడాలని అడిగినా అక్కడ వారు చూపించలేదని  మల్లయ్య  లబోదిబోమంటున్నారు. మరోపక్క భార్యకు  నాలుగు రోజుల తర్వాత విషయం తెలియజెప్పడంతో చివరి చూపునకు నోచుకోలేక వెంకటరమణమ్మ తల్లడిల్లిపోతోంది. అమ్ములు మృతదేహాన్ని బస్సులో తెచ్చుకోవడానికి అవకాశంలేదు. ఒకవేళ అంబులెన్స్‌లో తెచ్చుకుందామన్న ఆర్థిక పరిస్థితి లేక ఆసుపత్రి వాళ్లనే ఖననం చేయాలని చెప్పిన దీన పరిస్థితి.   

మరిన్ని వార్తలు