నా ఇంటికొచ్చి నన్నే బెదిరిస్తారా? మాజీ సీఎం

17 Feb, 2021 19:21 IST|Sakshi

తన ఇంటికొచ్చి బెదిరించారని ఆగ్రహం

వారికి ఆ హక్కు ఎవరిచ్చారని నిలదీత

విరాళాల వసూళ్లలో పారదర్శకత ఎక్కడ ఉంది?

ట్విటర్‌లో మాజీ సీఎం కుమార స్వామి వరుస ట్వీట్లు

బెంగళూరు: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సేకరిస్తున్న విరాళాలు వివాదాస్పదమవుతున్నాయి. శాంతియుతంగా సేకరించాల్సిన విరాళాలను బెదిరింపులకు పాల్పడుతూ.. ఇవ్వని వారిపై దాడి చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. అలాంటి పరిస్థితి తాను ఎదుర్కొన్నట్లు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు. తన ఇంటికి వచ్చి తననే బెదిరించారని తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. 

రామ మందిరం పేరుతో కొందరు బెదిరించి విరాళాలు వసూలు చేస్తున్నారని కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి ఆరోపణలు చేశారు. తాను కూడా ఒక బాధితుడినేనని తెలిపారు. ఓ మహిళతోపాటు మరో ఇద్దరు తన ఇంటికి వచ్చారని చెప్పారు. తాను విరాళం ఎందుకు ఇవ్వడం లేదని బెదిరించారని వాపోయారు. అసలు ఆమె ఎవరు..? మా ఇంటికి వచ్చి నన్ను అడిగే అధికారం ఆమెకు ఎవరు ఇచ్చారు..? అని ప్రశ్నించారు. 

ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతూ విరాళాలు సేకరించడం సరికాదని పేర్కొన్నారు. రామమందిర నిర్మాణానికి విరాళాలు సేకరించడంపై మాత్రం తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కుమారస్వామి స్పష్టం చేశారు. తాను కూడా విరాళం ఇస్తాను. మా పార్టీ నాయకులు చాలా మంది ఇచ్చారు. అయితే విరాళాల వసూళ్లలో పారదర్శకత ఎక్కడ ఉంది? అని కుమారస్వామి ప్రశ్నించారు. ఇంటింటికొచ్చి అడిగే అనుమతి ఎవరిచ్చారని నిలదీశారు. 

‘రామ మందిరం హిందువుల భక్తిమనోభావాలకు సంబంధించిన అంశం. అయితే దాని పేరుతో కొనసాగుతున్న విభజనపై నేను వ్యతిరేకం’’ అని కుమారుస్వామి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని నాజీలుగా పేర్కొన్నారు. జర్మనీలో హిట్లర్‌ చేసిన మాదిరి దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వానికి బాధ్యత ఉండదా అని ప్రశ్నించారు. విశ్వ హిందూ పరిషత్‌‌ను ఒక్కటే కోరుతున్నా.. డొనేషన్స్ వసూలు చేసే వాళ్లు నిజాయితీగా ఉండేలా చూడండి అని కుమారస్వామి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు