కర్ఫ్యూ ఫెయిల్‌: మే 24వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌

7 May, 2021 20:26 IST|Sakshi

కర్ణాటకలో సంపూర్ణ లాక్‌డౌన్‌

మే 10 నుంచి 24 వరకు విధించిన సీఎం యడియూరప్ప

సాక్షి బెంగళూరు: కరోనా విషయంలో ప్రస్తుతం మహారాష్ట్రతో పోటీ పడుతూ కర్నాటక దూసుకెళ్తోంది. పెద్ద ఎత్తున కేసులు, మరణాలు నమోదవుతుండడంతో ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. వైరస్‌ కట్టడి కోసం ఇన్నాళ్లు విధించిన పాక్షిక లాక్‌డౌన్‌ ఫెయిలైందని ఇకపై సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. నిత్యం 50 వేలకు పైగా కేసులు, 400 వరకు మరణాలు సంభవిస్తుండడంతో చివరి అస్త్రంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు సీఎంం యడియూరప్ప తెలిపారు.

కోవిడ్‌ కట్టడి కోసం ఏప్రిల్‌ 27 నుంచి మే 12 వరకు విధించిన కరోనా కర్ఫ్యూ వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో మే 10 నుంచి 24వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించారు. లాక్‌డౌన్‌పై మంత్రులు, అధికారులతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. 14 రోజుల లాక్‌డౌన్‌లో అత్యవసర సేవలు మినహాయించి అన్నింటిని బంద్‌ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప స్పష్టం చేశారు. నిత్యవసర సరుకుల కొనుగోలు కోసం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఒక్కరూ బయట కనిపించినా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అంతర్రాష్ట్ర, అంతర్‌జిల్లా ప్రయాణాలు, బార్లు, పాఠశాలలు, ప్రజా రవాణా, కర్మాగారాలు, అన్ని కార్యాలయాలు, మెట్రో రైల్వే మూతపడ్డాయి. అయితే భవన నిర్మాణ కార్మికులకు మినహాయింపు ఇచ్చారు. విమాన, రైల్వే రాకపోకలపై ఎలాంటి నిషేధం లేదు. వివాహాలకు కేవలం 50 మందికి మాత్రమే అవకాశం కల్పించారు.

చదవండి: కలకలం: కరోనా నుంచి కోలుకోగానే కళ్లు పోయాయి
చదవండి: ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’

మరిన్ని వార్తలు