చూ మంతర్‌కాళి.. కరోనా పో: బీజేపీ ఎమ్మెల్యే పూజలు

26 May, 2021 12:37 IST|Sakshi

బెంగళూరు: మహమ్మారి కరోనా వైరస్‌పై ఇంకా మూఢ నమ్మకాలు పోవడం లేదు. స్వయంగా ప్రజాప్రతినిధులే ఆ పూజలు ఈ పూజలు చేయండి.. కరోనా పోతుందని ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే అగ్నిహోత్ర హోమం చేపట్టారు. ఆ హోం చేయడం వరకు మంచిదే కానీ.. ఆ తర్వాత ధూపం పేరిట ఊరంతా పొగ పెట్టాడు. సామ్రాణి వేస్తూ స్వయంగా ఆ ఎమ్మెల్యే రిక్షా బండి తోలుకుంటూ వెళ్లాడు. 

కర్నాటకలోని బెళగావి దక్షిణ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభయ్‌ పాటిల్‌ మంగళవారం పూజలు చేశాడు. కొబ్బరి, నెయ్యి, బియ్యం ఇతర మూలికలు వేసి అగ్నిహోత్ర హోమం చేశాడు. అనంతరం ఒక రిక్షా బండిలో కూడా ఆ పదార్థాలన్నీ వేసి నిప్పు పెట్టాడు. పొగ వస్తుండడంతో ఆ రిక్షా బండిని తన అనుచరులతో కలిసి గుంపుగా బెళగావి పట్టణంలో తిరిగాడు.

ఆ పొగ పీలిస్తే కరోనా పోతుందని ఎమ్మెల్యే అభయ్‌ పాటిల్‌ తెలిపాడు. అయితే అతడి చర్యను ప్రతిపక్ష పార్టీలు తప్పుబట్టాయి. మూఢనమ్మకాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకుండా తన అనుచరులతో తిరుగుతూ నిబంధనలు ఉల్లంఘించారని సోషల్‌ మీడియాలో నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు