ఎస్‌ఐ పోస్టుల స్కాం: పోలీసుల అదుపులో డీఎస్పీ, సీఐ

6 May, 2022 07:24 IST|Sakshi

బనశంకరి: ఎస్‌ఐ పోస్టుల కుంభకోణంతో ప్రమేయం ఉందని లింగసుగూరు డీఎస్‌పీ మల్లికార్జున సాలి, కలబురిగి క్లూస్‌ విభాగం సీఐ ఆనంద మైత్రిని బుధవారం నుంచి సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గురువారం కూడా విచారించి మధ్యలో వైద్య పరీక్షల కోసం కలబురిగి ఆస్పత్రికి తీసుకెళ్లారు. బ్లూటూత్‌ ద్వారా అభ్యర్థులకు సమాధానాలు చెప్పడానికి సూత్రధారి రుద్రేగౌడ పాటిల్‌ వద్ద ఒప్పందం కుదుర్చుకున్నారని అనుమానాలున్నాయి. అలాగే బెంగళూరులో ఎస్‌ఐ పరీక్ష ఉత్తీర్ణుడైన ఒక కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు. మరికొందరు పోలీస్‌ అధికారులు, సిబ్బందికి అరెస్ట్‌ భయం ఏర్పడింది. ఇప్పటివరకు 7 మంది పోలీసులు అరెస్టయి సస్పెండ్‌ అయ్యారు. ఈ కేసులో అందరూ కలిపి సుమారు 27 మంది అరెస్టయ్యారు.  

పరీక్ష నిర్వహణలో అవకతవకలు  
545 ఎస్‌ఐ పోస్టులకు అక్టోబరులో రాష్ట్రవ్యాప్తంగా 92 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. సాధారణంగా పోలీస్‌ నియామక పరీక్షను అన్ని దశల్లో పకడ్బందీగా నిర్వహించాలి. ప్రశ్నాపత్రాలను భద్రపరచిన కేంద్రం నుంచి పరీక్షా కేంద్రాలకు తరలింపు, అక్కడ ఓపెన్‌ చెయ్యడం, పరీక్షలు రాయడం, సమాధాన పత్రాల సేకరణ, తరలింపు, భద్రపరచడం ఇలా అనేక అంశాలను వీడియో తీయాలి. కానీ ఈ ఎస్‌ఐల పరీక్షలో అనేక అవకతవకలు జరిగినట్లు తేలింది.  

ఊరికే ఆరోపణలొద్దు: సీఎం  
ఎస్‌ఐ నియామక అక్రమాల కేసులో ఆరోపణలొచ్చిన మంత్రి అశ్వత్థ నారాయణకు సీఎం బొమ్మై అండగా నిలిచారు. ఆయనపై కాంగ్రెస్‌ నేతలు హిట్‌ అండ్‌ రన్‌ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణలకు సాక్ష్యాధారాలుంటే అందజేయాలన్నారు. కాంగ్రెస్‌ సర్కారు హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని, అప్పుడు ఎంతమందిని అరెస్టు చేశారని ప్రశ్నించారు. 

కేసును మూసేస్తారు: కుమారస్వామి  
ఎస్‌ఐ స్కాంను 15 రోజుల్లో మూసివేస్తారని జేడీఎస్‌ నేత, మాజీ సీఎం హెచ్‌డీ.కుమారస్వామి ఆరోపించారు. ఇది కూడా డ్రగ్స్‌ కేసు మాదిరే అవుతుందన్నారు. కేపీఎస్సీలో పోస్టుకు ఇంత అని రేటు నిర్ణయించారన్నారు.  

ఇది కూడా చదవండి: పాక్‌ నుంచి రిందా కుట్ర

మరిన్ని వార్తలు