సమూలంగా ప్రక్షాళన

18 Mar, 2023 00:42 IST|Sakshi
డీడీ చాంబర్‌లో సీసీ కెమెరాల మానిటర్‌
● ప్రభుత్వ పాడి పరిశ్రమ అభివృద్ధిపై దృష్టి ● డెయిరీలో సీసీ కెమెరాలు, ఉద్యోగులకు బయోమెట్రిక్‌ ● నెలన్నరలో రూ.22లక్షల బకాయిలు వసూళ్లు ● పాల సేకరణ పెంచేందుకు సర్వేలు

ఖమ్మంవ్యవసాయం: అవినీతి అక్రమాలకు నిలయంగా మారిన జిల్లా పాడి పరిశ్రమ(విజయ డెయిరీ)ను ప్రక్షాళన చేసేందుకు యంత్రాంగం నడుం బిగించింది. కొన్నేళ్లుగా ఖమ్మం పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య(విజయ డెయిరీ)లో అవినీతి రాజ్యమేలుతుండగా, అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకున్నా, కొత్త వారిని నియమించినా తీరు మారటం లేదు. ఖమ్మం పాడి పరిశ్రమలో అనాదిగా పాలు, పాల పదార్థాలు పక్కదారి పట్టడం తదితర అక్రమాలతో సుమారు రూ.40 లక్షల మేర దుర్వినియోగమైనట్లు గుర్తించారు. దీంతో కొన్నాళ్ల క్రితం డీడీ సత్యనారాయణను మాతృసంస్థకు బదిలీ చేయడమే కాక మేనేజర్లు భరతలక్ష్మి, నరేష్‌, ప్లాంట్‌ ఆపరేటర్‌ మణి, ల్యాబ్‌ అసిస్టెంట్‌ నాగశ్రీని సస్పెండ్‌ చేశారు. అనంతరం వరంగల్‌ పశుసంవర్థక శాఖ ఏడీ అసోడ కుమారస్వామిని ఖమ్మం విజయ డెయిరీ డీడీగా నియమించారు. ఈమేరకు ఉన్నతాధికారులు ఖమ్మం డెయిరీపై ప్రత్యేక దృష్టి సారించి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టగా దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి.

ఐదుగురే రెగ్యులర్‌ ఉద్యోగులు

ఉమ్మడి జిల్లా పాడి పరిశ్రమలో మొత్తం 53 మంది ఉద్యోగులు పనిచేస్తున్నా వీరిలో ఐదుగురే రెగ్యులర్‌ ఉద్యోగులే ఉన్నారు. మిగతా వారంతా ఔట్‌ సో ర్సింగ్‌ ఉద్యోగులే కావడం గమనార్హం. కాగా, ప్లాంట్‌ పాల నిర్వహణ, రవాణా, వెన్న, పాల పదార్థాల తరలింపును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు డెయిరీ ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి పుటేజీతో పాటు సిబ్బంది కదలికలను డీడీ చాంబర్‌ నుంచే పర్యవేక్షించేలా మానిటర్లు బిగించారు. అలాగే, అదనపు సెక్యూరిటీ గార్డుల నియామకానికి రంగం సిద్ధమైంది. దీనికి తోడు కొందరు ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలతో అటెండర్‌ మొదలు ఉన్నత స్థాయి అధికారి వరకు హాజరు నమోదు చేసేందుకు శుక్రవారం నుంచి బయోమెట్రిక్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.

బకాయిల వసూళ్లు, పాల సేకరణ

పాడి పరిశ్రమలో గతనెల 1వ తేదీ నాటికి రూ.46లక్షల బకాయిలు పేరుకుపోయాయి. నూతన డీడీ నేతృత్వాన బకాయిల్లో రూ.22లక్షలు వసూలు చేయగా.. ఇంకా రూ.24 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. ఇక మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి 2016–17 సంవత్సరం నాటి బకాయిలు రూ.30 లక్షలు ఉండగా వసూళ్లపై దృష్టి సారించారు. అలాగే, విజయ డెయిరీకి పాల సేకరణ పెంచేందుకు గాను సర్వే కోసం ఆరు బృందాలను నియమించారు. ఒక్కో బృందంలో సూపర్‌వైజర్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌, డాక్‌ వర్కర్‌తో పాటు డీడీ కార్యాలయ సిబ్బందిని నియమించగా, వీరు సత్తుపల్లి, కల్లూ రు, కామేపల్లి, ఎర్రుపాలెం బల్క్‌మిల్క్‌ కేంద్రాల పరిధిలోని 16 రూట్లు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం బల్క్‌మిల్క్‌ కేంద్రాల పరిధి ఆరు రూట్లలో సర్వే చేస్తున్నారు. పాల ఉత్పత్తిదారులను కలుస్తూ విజయ డెయిరీకి పాలు పోస్తే కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. దీంతో ప్రస్తుతం 8,172 లీటర్ల పాలు సేకరిస్తుండగా, త్వరలోనే మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

ప్రగతిపథంలో నిలిపేందుకు కృషి

డెయిరీని ప్రగతిపథంలో నిలిపేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. ఉద్యోగులు, పాల ఉత్పత్తిదారుల కృషితో లక్ష్యాలను చేరుకుంటామనే నమ్మకం ఉంది. రాష్ట్ర సంస్థ నిత్యం నిర్దేశించిన లక్ష్యం మేరకు పాల సేకరణపై దృష్టి సారించగా, అక్రమాలకు తావు లేకుండా నిఘా పెంచాం.

– అసోడ కుమారస్వామి,

డీడీ, విజయ డెయిరీ

మరిన్ని వార్తలు