అరుణాచలమే రావాలా?!

27 Mar, 2023 00:08 IST|Sakshi

ఖమ్మం సహకారనగర్‌: గతంలో ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం అరకొరగా నిధులు కేటాయించేది.ఆ నిధుల్లో నుంచే సౌకర్యాల కల్పన, ఇతర అవసరాలకు ఖర్చు చేయడం ఇబ్బందిగా మారేది. కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ మన ఊరు – మన బడి ద్వారా అభివృద్ధి చేస్తుండడమే కాక పాఠశాలల్లో కనీస అవసరాలు తీర్చేందుకు నిధులు కేటాయిస్తోంది. అయితే, ఆ నిధులను సకాలంలో వినియోగించుకోవడంలో విద్యాశాఖ అధికారులు, కొందరు హెచ్‌ఎంలు విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి.

1,190 పాఠశాలలకు గ్రాంట్‌
2022–23వ విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 1,190 ప్రభుత్వ పాఠశాలలకు కాంపోజిట్‌ గ్రాంట్‌, స్పోర్ట్స్‌ గ్రాంట్‌ కేటాయించారు. ఇందులో కాంపోజిట్‌ గ్రాంట్‌గా రూ.3,03,20,000, స్పోర్ట్స్‌ గ్రాంట్‌గా వచ్చిన రూ.79,65,000 నిధులను ఈనెల 31వ తేదీలోగా వెచ్చించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆ నిధులు వెనక్కి వెళ్తాయని తెలిసినా సద్వినియోగం చేసుకోవడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

కేటాయింపు ఇలా ..
ప్రాథమిక పాఠశాలలో 100మంది విద్యార్థులు ఉంటే రూ.25వేలు, యూపీఎస్‌కు సైతం రూ.25వేలు ఇస్తారు. అదే హైస్కూళ్లకై తే రూ.50వేల రూపాయలు కేటాయిస్తుంటారు. ఇక విద్యార్థులు ఎక్కువ ఉంటే నిధులు అదనంగా వస్తాయి. ఈ నిధులతో పాఠశాలల విద్యుత్‌ బిల్లుల చెల్లింపు, చిన్నచిన్న మరమ్మతులు చేయించుకోవచ్చు. అలాగే, చాక్‌పీస్‌లు, డస్టర్లు, పెన్నులు, పెన్సిళ్లు, జాతీయ జెండా ఆవిష్కరణలు తదితర అవసరాలకు ఉపయోగించాల్సి ఉంటుంది. డిజిటల్‌ బోధన అందుబాటులో ఉన్న చోట పెన్‌డ్రైవ్‌లు, కుర్చీలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.

పారదర్శకత పేరిట పక్కకు...
గతంలో పాఠశాల హెచ్‌ఎం, ఎస్‌ఎంసీ చైర్మన్‌ చెక్‌పై సంతకం చేస్తే నిధులు డ్రా చేసి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసేవారు. తాజాగా విద్యాశాఖ బ్యాంక్‌ అకౌంట్లను మార్పు చేయటంతో పాటు ఆన్‌లైన్‌లోనే బిల్లులు చెల్లింపు చేస్తున్నారు. ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే షాపు నిర్వాహకుడి బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు తీసుకుని... పాఠశాల హెచ్‌ఎం, ఎస్‌ఎంసీ చైర్మన్‌ బ్యాంక్‌కు వెళ్లి వివరాలు సమర్పిస్తే బ్యాంక్‌ నుంచే షాపు నిర్వాహకుడికి అకౌంట్‌లోకి నిధులు జమ చేసే విధానం అమల్లోకి వచ్చింది. ఈ కారణంగా కూడా నిధుల వ్యయంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

నిధులు ఇక్కడే ఎక్కువ

జిల్లా విద్యాశాఖలో గతంలో పలుమార్లు కూడా ఏడాదికి రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకు నిధులు ఖర్చు చేయకపోవడంతో వెనక్కు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం రూ.3.82 కోట్ల మేర నిధులు అందుబాటులో ఉండగా.. ఇందులో ఆర్థిక సంవత్సరం ముగిసేలా ఎంత వరకు వ్యయం చేస్తారు.. ఇంకా ఎన్ని నిధులు వెనక్కు వెళ్తాయో వేచి చూడాల్సిందే.

ఇలా చేస్తే ఉపయోగం
నిధులు వెనక్కి వెళ్లకుండా చూసేందుకు అధికారులు, హెచ్‌ఎంలు ఇకనైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పదో తరగతితో పాటు ఇతర తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున వారికి అవసరమయ్యే పరీక్ష ఫ్యాడ్లు, పెన్నులు తదితరాలు కొనుగోలు చేస్తే కొంత మేర ఫలితం ఉంటుంది. అలాగే, విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు క్రీడా సామగ్రి కొనుగోలు చేయడం ద్వారా నిధులు ఉపయోగంలోకి వస్తాయి.

అవసరాలకు అనుగుణంగా ఉపయోగిస్తున్నాం
పాఠశాలలకు సంబంధించి కాంపోజిట్‌ గ్రాంట్‌ను అక్కడి అవసరాలకు అనుగుణంగా ఉపయోగిస్తున్నాం. అలాగే, స్పోర్ట్స్‌ గ్రాంట్‌తో విద్యార్థులకు అవసరమైన క్రీడా సామగ్రి కొనుగోలుకు కలెక్టర్‌ సూచనలు చేశారు.

– సోమశేఖర శర్మ, జిల్లా విద్యాశాఖాధికారి

మరిన్ని వార్తలు