ఖమ్మం జిల్లాలో మెగా సంత.. పశువుల నుంచి పంటల దాకా

31 Mar, 2023 00:42 IST|Sakshi
కొనుగోలు, అమ్మకందారులో సంతలో రద్దీ
పండితాపురంలో ప్రతీ బుధవారం సంత.. పశువులు, మేకల క్రయవిక్రయాలకు ఉమ్మడి ఏపీలోనే మంచి పేరు రూ.లక్షలు దాటి రూ.2కోట్లకు పైగా పలుకుతున్న వేలం

ఒక గ్రామంలో జరిగే సంత... మూడు దశాబ్దాలకు చేరుతున్న చరిత్ర.. ఏటా రూ.2కోట్లు దాటుతున్న వేలం.. వారానికి రూ.5 లక్షలకు పైగా వ్యాపారం.. రకం రశీదులు ఇచ్చేందుకే వంద మంది విధులు.. రెండు రాష్ట్రాల నుంచి కొనుగోలు, అమ్మకందారుల రాక.. ఇలా చెప్పుకుంటూ పోతే ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కొమ్మినేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పండితాపురంలో జరిగే వారాంతపు సంత విశేషాలే అన్నీఇన్నీ కావు! ఆ వివరాలు, విశేషాలు తెలుసుకుందాం..

ముప్ఫై ఏళ్లకు చేరువలో...

కొమ్మినేపల్లి జీపీ పరిధి పండితాపురంలో 28ఏళ్ల క్రితం పశువుల క్రయవిక్రయాల కోసం సంత మొదలుపెట్టారు. అప్పట్లో సంత నిర్వహణ బాధ్యతలు చేపట్టిన వ్యక్తి కుమారుడి పేరు శ్రీకృష్ణప్రసాద్‌ కావడం.. గ్రామానికి చెందిన ఓ రాజకీయ నేత పేరు కూడా కావడంతో ఆ పేరుతో సంతను పిలవడం ప్రారంభమైంది. అయితే, తొలి నాళ్లలో కేవలం పశువుల కోసం సంత ఏర్పాటుచేసినా... ప్రతీ బుధవారం జరిగే సంతలో ఇప్పుడు ఇక్కడ దొరకని వస్తువంటూ ఉండదనే చెప్పాలి. దీంతో ఇటు తెలంగాణ, అటు ఏపీలోని అన్ని ప్రాంతాల నుంచి వ్యాపారులు, రైతులు వచ్చి కొనుగోళ్లు చేయడం.. కొందరు మారుబేరానికి వస్తుండడం ఆనవాయితీగా మారింది.

పోటాపోటీ.. గ్రామానికి లాభాల పంట

సంత నిర్వహణ ప్రదేశం ఏజెన్సీ కావడంతో నిర్వహణ బాధ్యతలు కేవలం గిరిజనులకే ఇవ్వాలన్న నిబంధన ఉంది. దీని ఆధారంగా ఏటా జరిగే వేలంలో వీరినే అనుమతిస్తారు. కానీ రానురాను సంత వేలం పాట రూ.వేలు, రూ.లక్షలు దాటి రూ.కోట్ల కు చేరడంతో అంత స్థోమత లేక గిరిజనులు జట్టుగా ఏర్పడి వేలంలో పాల్గొంటారు. ప్రతి బుధవా రం రూ.3లక్షలు మొదలు రూ.5లక్షల మేర ఆదా యం నమోదవుతుండడంతో సంత నిర్వహణను దక్కించుకునేందుకు పోటీ కూడా అదే స్థాయిలో ఉంటోంది. ఇలా పోటీ పడుతుండడంతో గ్రామపంచాయతీకి కూడా ఆదాయం దండిగానే దక్కుతోంది. సంత వేలం ద్వారా వచ్చే ఆదాయంతో గ్రామంలో సీసీ రోడ్లే కాక ప్రత్యేకంగా బైపాస్‌ రోడ్డు, సెంట్రల్‌ లైటింగ్‌, జీపీ భవనం, సంతలో షెడ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాల కల్పన సులువైంది.

పశువులే కాదు... సూపర్‌ మార్కెట్‌!

ఉమ్మడి ఖమ్మంతో పాటు తెలంగాణలోని చుట్టుపక్కల జిల్లాలే కాదు.. ఏపీలోని జిల్లాల నుంచి కూడా పండితాపురం సంతకు వ్యాపారులతో పాటు ప్రజలు రావడం ఆనవాయితీగా మారింది. ఎవరి ఇంట్లో ఏ వేడుక జరిగినా మేకల కొనుగోలుకు పండితాపురం బాట పట్టాల్సిందే. వేల సంఖ్యలో రైతులు, సాధారణ ప్రజలు వస్తుండడంతో కాలక్రమంలో పశువులు, మేకలే కాక అన్ని సామగ్రి విక్రయించడం మొదలైంది. పశువుల అలంకరణ వస్తువులు, రైతులకు ఉపయోగపడే పనిముట్లు, ఇళ్లలోకి కావాల్సిన కిరాణం సామగ్రి, కూరగాయలు.. ఇలా చెప్పుకుంటూ పండితాపురం సంతలో సూపర్‌మార్కెట్‌లో లభించేవన్నీ ఏ ఒక్కటి తక్కువ కాకుండా కొనుక్కోవచ్చు. కాగా, పది మందికి పైగా కలిసి సంత వేలం దక్కించుకుంటుండగా.. ప్రతీ బుధవారం సంతలో రశీదులు ఇవ్వడం, ఇతర బాధ్యతలు చూసుకునేందుకు వంద మందిని నియమించి ఉపాధి కల్పిస్తుండడం విశేషం.

మేకపోతులు కొనుగోలు చేస్తాం

మా ప్రాంతంలో మేకపోతులు దొరకవు. అందుకే ప్రతీ వారం ఇక్కడకు వచ్చి వందకు పైగా మేకపోతులు కొనుగోలు చేస్తాం. ఇక్కడి ధరపై కాస్త లాభం చూసుకుని మా వద్ద అమ్ముకుంటాం. ఇదే మాలాంటి వారికి జీవనాధారంగా మారింది.

– ఎన్‌.సత్యం బంగారురాజుపేట, విజయనగరం జిల్లా

మరిన్ని వార్తలు