దయచేసి.. మా కుమారుడిని కాపాడండి!

20 Oct, 2023 13:07 IST|Sakshi
ఆపన్నహస్తం అందించాలని కోరుతున్న హర్షిత్‌ తల్లిదండ్రులు

ఆపన్నహస్తం కోసం ఓ నిరుపేద కుటుంబం వేడుకోలు

మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 7వ తరగతి విద్యార్థి..

ఖమ్మం: మెదడులో నీరు చేరడంతో అనారోగ్యం పాలైన ఓ విద్యార్థి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. బ్రెయిన్‌కు సర్జరీ చేస్తేనే బతుకుతాడని వైద్యులు సూచించడంతో కన్నీరుమున్నీరవుతున్న ఆ తల్లిదండ్రులు దాతల సాయం కోసం వేచిచూస్తున్నారు.

వివరాల్లోకి వెళితే... మండల పరిధిలోని గాదెపాడు గ్రామానికి చెందిన భూక్యా సంతు, ప్రమీల దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడైన భూక్యా హర్షిత్‌ కారేపల్లిలోని మోడల్‌ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాడు. కాగా మూడేళ్ల కిందట హర్షిత్‌కు జ్వరం రావడంతో ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చూపించగా.. చిన్నారి బ్రెయిన్‌లో నీరు చేరిందని అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో హర్షిత్‌కు రెండుసార్లు బ్రెయిన్‌ సర్జరీ జరిగి కోలుకుంటున్న క్రమంలో ఇటీవల తిరిగి అనారోగ్యానికి గురికావడంతో రెయిన్‌బోకు తీసుకొచ్చారు.

చికిత్స అనంతరం మరోసారి బ్రెయిన్‌ సర్జరీ చేయాలని, సుమారు రూ.7 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యు లు తెలపడంతో ఇప్పటికే ఇల్లు, వాకిలి అమ్ముకోవడంతో పాటు స్నేహితుల సహకారంతో రూ.12 లక్షల వరకు ఖర్చుచేశామని వాపోయారు. ఇదిలా ఉండగా హర్షిత్‌ తండ్రి సంతుకు 2021వ సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు గాయమై బ్రెయిన్‌ సర్జరీ కావడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలతో రోడ్డున పడాల్సిన పరిస్థితి దాపురించింది. తమ కుమారుడి ప్రాణాలైనా కాపాడుకుందామని, దాతలు సహకరించాలని హర్షిత్‌ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
చదవండి: బ్యాంకుల వద్ద మఫ్టీలో ఉండి మరీ అరాచకం..! ఒక్కసారిగా ఇలా..

మరిన్ని వార్తలు