సత్తుపల్లిలో ఐటీ టవర్‌

16 Nov, 2023 00:34 IST|Sakshi
మాట్లాడుతున్న సండ్ర వెంకటవీరయ్య, పక్కనే ఎంపీ పార్థసారధిరెడ్డి
● జిల్లా ఏర్పాటుకు తొలి ప్రాధాన్యత ● దళితబంధు ఇవ్వకపోతే ఓట్లు అడగం ● బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య

సత్తుపల్లి: సత్తుపల్లి నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని.. ఇందులో భాగంగా ఈసారి గెలవగానే నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా ఐటీ టవర్‌ ఏర్పాటుచేస్తామని ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య వెల్లడించారు. వేంసూరు మండలం అమ్మపాలెంలో బుధవారం ఎంపీ బండి పార్థసారధిరెడ్డితో కలిసి ఆయన నియోజకవర్గ మేనిఫెస్టోను ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే ఇచ్చిన హామీ మేరకు వచ్చే జనవరి కల్లా నియోజకవర్గంలోని దళితలందరికీ దళితబంధు ఇవ్వకపోతే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటు అడగబోమని తెలిపారు. అలాగే, పది జిల్లాలను 33 జిల్లాలుగా చేసిన సీఎం కేసీఆర్‌తో మాట్లాడి.. సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలను కలిసి సత్తుపల్లి జిల్లా సాధిస్తామని చెప్పారు. అంతేకాక బీసీ బంధు, డీడీలు కట్టిన గొల్లకుర్మకులకు యూనిట్లు, సత్తుపల్లి మండలం బుగ్గపాడు ఫుడ్‌పార్క్‌ను అభివృద్ధి చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని వివరించారు. కాగా, సింగరేణి బాంబు పేలుళ్లతో దెబ్బ తిన్న ఇళ్లను మరమ్మతు చేయించడమేకాక సంస్థ నుంచి మరిన్ని నిధులు సాధిస్తామని సండ్ర తెలి పారు. వేంసూరు, తల్లాడ, పెనుబల్లి మండలాల్లో రెసిడెన్షియల్‌ పాఠశాల, నూతన బస్టాండ్‌, సెంట్రల్‌ లైటింగ్‌, జూనియర్‌ కళాశాల, ఇంటిగ్రేటెడ్‌ మార్కె ట్లు, కల్లూరులో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని వివరించారు. ఎంపీ బండి పార్థసారధిరెడ్డి ప్రకటించిన రూ.కోటి విరాళంతో కల్లూరులో నూతన బస్టాండ్‌ నిర్మిస్తామని, సత్తుపల్లిలో ఆటోనగర్‌ ఏర్పాటు, అటవీశాఖ స్థలాన్ని బదలాయించి ఇళ్ల స్థలాలకు కేటాయిస్తామని సండ్ర తెలిపారు. అంతేకాకుండా సీతారామ ద్వారా గోదావరి జలాలతో సత్తుపల్లి ప్రజల పాదాలను కడుగుతామని వివరించారు.

దేనికై నా సమాధానం చెపుతాం..

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు కుట్రపూరితంగా సోషల్‌ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని సండ్ర వెంకటవీరయ్య మండిపడ్డారు. వ్యక్తిగత జీవితాలపై మాట్లాడడం తమకు చేతనైనప్పటికీ సంస్కారం ఉన్నందున అలా చేయడం లేదని తెలిపారు. తమకు ఓ వర్గం దూరమైందని దుష్ప్రచారం చేస్తున్నారని.. కానీ మున్సిపల్‌ చైర్మన్‌, ఎంపీపీ, సొసైటీ చైర్మన్లతో పాటు పలుచోట్ల సర్పంచ్‌లు, డీసీసీబీ డైరెక్టర్‌ పదవులను కమ్మవర్గానికే ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తన రాజకీయ జీవితంలో ఏ ఒక్కరిపై అక్రమ కేసులు పెట్టలేదని, వేధించలేదని తెలిపారు. కానీ ఇప్పుడు కొందరు గెలుపోటములు, మెజార్టీపై బెట్టింగ్‌ కాస్తూ నియోజకవర్గంలో విషసంస్కృతిని ప్రవేశపెట్టారని.. దీని ద్వారా ఎవరి జీవితాలను రోడ్డున పడేస్తారని సండ్ర వెంకటవీరయ్య ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు