అర్ధరాత్రి హెడ్‌కానిస్టేబుల్‌ ఇంట్లో చోరీ!

21 Dec, 2023 00:22 IST|Sakshi
వివరాలు సేకరిస్తున్న ఖమ్మం క్లూస్‌ టీం

ఫంక్షన్‌కు వెళ్లిన సమయంలో ఘటన

ఖమ్మం: ఫంక్షన్‌కు వెళ్లి వచ్చేసరికి బెటాలియన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ఇంట్లో చోరీ జరిగిన ఘటన సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గంగారం 15వ బెటాలియన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కోరం లక్ష్మణ్‌రావు, నాగకుమారి దంపతులు బేతుపల్లిలోని గౌండ్లబజార్‌లో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి సత్తుపల్లిలో ఓ ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. కిచెన్‌ తలుపులు తీసి ఉండటాన్ని గమనించారు. బీరువాలోని రూ.12 లక్షల విలువ చేసే 18 తులాల బంగారంతో పాటు రూ.25 వేల నగదును అపహరించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్తుపల్లి ఎస్‌ఐ కుశకుమార్‌ ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరో ఇంట్లో కూడా..
గ్రామంలోని పటంబజార్‌లో దొడ్డా శ్రీనివాసరావు ఇంట్లోకి ముసుగులు ధరించిన దుండగులు మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో వచ్చి సీసీ కెమెరాల వైర్లను కత్తిరించారు. ప్రధాన ద్వారం తలుపు పగులగొట్టి లోనికి ప్రవేశించి బెడ్రూంలోని కబోర్డులో దుస్తులు, వస్తువులను కిందపడేసి వెతికినా వారికి ఏమీ లభించకపోవడంతో వెనుదిరిగారు. ఇంటి యజమాని అమెరికా వెళ్లినట్లు తెలిసింది. సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చ‌ద‌వండి: మరొక‌రితో క‌లిసి త‌మ్ముడిని అన్న దారుణంగా..

>
మరిన్ని వార్తలు