షడ్రుచుల సమ్మేళనమే జీవితం

23 Mar, 2023 01:36 IST|Sakshi

భవానీపురం(విజయవాడపశ్చిమ):ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనమని, ప్రతి రుచికి ఒక అనుభూతి ఉంటుందని రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డ్‌ ఉపాధ్యక్షుడు, సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఆయా రుచుల అనుభూతుల సమ్మేళనమే జీవితమన్నారు. శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా మల్లాది వేంకట సుబ్బారావు చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బుధవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సంగీత, సాహిత్య, కళారంగాల్లో లబ్దప్రతిష్టులైనవారికి ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. తొలుత విష్ణు సహస్రనామ పారాయణం, కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు, వేద పండితులతో వేద స్వస్తి నిర్వహించారు. అనంతరం రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ ఆస్థాన సిద్ధాంతి కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ఉగాది పచ్చడిలో తీపి, పులుపు, చేదు ఉన్నట్లుగా మానవ జీవితం సుఖదుఃఖాల సమాహారమని చెప్పారు. వాటన్నింటినీ సమభావంతో స్వీకరించి ముందుకు వెళ్లాలని సూచించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రానున్న రోజుల్లో ప్రజలందరికీ మరింత మేలు జరగాలని ఆకాంక్షించారు. పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ అనంతమైన కాలచక్రాన్ని, దాని స్థితిగతులను ఉగాది పండుగ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. అధికార భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌బాబు మాట్లాడుతూ సమాజాన్ని బతికించేదే సంస్కృతి అన్నారు. కాలానుగుణంగా నడుచుకోవాలని పేర్కొన్నారు. పద్మశ్రీ అన్నవరపు రామస్వామి, గజల్‌ శ్రీనివాస్‌, క్రోవి సార్థసారథి, పద్మశ్రీ దండమూడి సుమతీ రామమోహన్‌రావు, రాణి నరసింహమూర్తి, మల్లాది సూరిబాబు, పాలపర్తి శ్యామలానందప్రసాద్‌, ఉపద్రష్ట వెంకట రమణమూర్తి, డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ, డాక్టర్‌ జి.ఈశ్వర్‌, వీవీ శివరామకృష్ణ, దామోదర గణపతిరావు, సాయి గీత, రాళ్లపల్లి నవీన్‌, యడవల్లి రాము, గోనుగుంట్ల యలమందరావు, భాగవతుల వెంకటరామ శర్మలకు ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. ఏపీ ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పి.గౌతంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ జమలపూర్ణమ్మ, డెప్యూటీ మేయర్‌ అవుతు శైలజ రెడ్డి, మల్లాది రాజేంద్ర, వేముల హజరత్తయ్య గుప్తా, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మల్లాది విష్ణు

వివిధ రంగాల్లోని లబ్దప్రతిష్టులకు

పురస్కారాలు ప్రదానం

మరిన్ని వార్తలు