జగనన్న లేఔట్లు : కొత్త ఊళ్లకు కొంగొత్త హంగులు

21 Apr, 2023 01:22 IST|Sakshi
ఉప్పలూరులోని జగనన్న కాలనీలో జరుగుతున్న విద్యుదీకరణ పనులు

జగనన్న లే అవుట్‌లలో సమకూరుతున్న వసతులు

శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు

ఊళ్లుగా మారుతున్న జగనన్న కాలనీలు

స్వాగత ద్వారాలకు రూ. 2.90 కోట్లు మంజూరు

కంకిపాడు (పెనమలూరు): జగనన్న లే అవుట్‌లలో ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. సకల హంగులు సమకూరుతుండటంతో ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగం పుంజుకుంది. నిర్మాణాలు పూర్తయిన లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసి నివాసం ఉంటున్నారు. ఇళ్ల నిర్మాణాలతో లే అవుట్‌లు కాస్తా ఊళ్లను తలపిస్తున్నాయి. పేదలకు కేటాయించిన లే అవుట్‌లు కార్పొరేట్‌ సంస్థలు నిర్మించే లే అవుట్‌లను తలదన్నేలా స్వాగత ద్వారాలను నిర్మించేందుకు నిధులు కేటాయింపులు, పరిపాలనా ఆమోదం లభించాయి.

జిల్లాలో ఇదీ పరిస్థితి..

కృష్ణాజిల్లా వ్యాప్తంగా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా 670 లే అవుట్‌లను ఏర్పాటు చేశారు. వీటిలో 93,245 గృహాలు మంజూరు చేయగా, 91,250 గృహాలు వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. ఈ ఏడాది ఉగాది నాటికి 13వేల గృహాలు నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకోగా 14,023 గృహాలు పూర్తయ్యేలా జిల్లా యంత్రాంగం కృషి చేయటంతో జిల్లా ప్రథమస్థానం దక్కటం తెలిసిందే. ఇప్పటి వరకూ రూ. 362.15 కోట్ల సొమ్మును లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాల నిమిత్తం చెల్లింపులు చేశారు.

వేగంగా వసతుల కల్పన..

ఇళ్ల నిర్మాణాలకు అనువుగా జగనన్న లే అవుట్‌లు (జగనన్న కాలనీలు)లో వసతుల కల్పన పనులు వేగంగా సాగుతున్నాయి. ఆయా లే అవుట్‌ల మెరక పనులు, అంతర్గత రహదారులు, విద్యుదీకరణ పనులకు ఇప్పటికే రూ. 82.66 కోట్లు వెచ్చించారు. ఈ నిధులతో కాలనీలకు విద్యుత్‌ వసతి, రహదారి వసతి సమకూరింది. మెరక పనులతో ముంపు సమస్య నుంచి లబ్ధిదారులకు ఊరట లభించింది.

తాగునీటి వసతుల కల్పనకు గానూ రూ. 64.88 కోట్లు నిధులు వెచ్చించి వసతులు కల్పించారు. దీంతో నివేశనస్థలం కేటాయించిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు ముందుకు వచ్చి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకుంటున్నారు. ప్రభుత్వం చెల్లించే సొమ్ముతో పాటుగా డ్వాక్రా మహిళలకు రూ. 35 వేలు, సీఐఎఫ్‌ కింద రూ. 35 వేలు, ఉన్నతి పథకం కింద రూ. 50 వేలు రుణాలను బ్యాంకుల నుంచి అందిస్తుండటంతో నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. ఫలితంగా జగనన్న లే అవుట్‌లు వసతులతో కూడిన ఊళ్లను తలపిస్తున్నాయి.

కార్పొరేట్‌కు దీటుగా..

పేదలకు కేటాయించిన జగనన్న లే అవుట్‌లలో వసతుల కల్పనతో పాటుగా కార్పొరేట్‌కు దీటుగా కాలనీలను తయారు చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఆయా కాలనీలకు ఆకర్షణీయంగా కార్పొరేట్‌ సంస్థలు నిర్మించే రియల్‌ వెంచర్లను తలదన్నేలా స్వాగత ద్వారాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా కృష్ణాజిల్లాలో తొలి విడత 63 లే అవుట్‌లలో స్వాగత ద్వారాల ఏర్పాటుకు రూ. 2.90 కోట్లు నిధులు కేటాయించింది. ఇందుకు సంబంధించి పరిపాలనా ఆమోదం లభించటంతో గృహనిర్మాణ సంస్థ ఆర్చ్‌ల నిర్మాణ పనులపై దృష్టి సారించింది. వారంలో పనులు ప్రారంభించేందుకు సమాయత్తం అయ్యింది.


సకల వసతులు కల్పిస్తున్నాం..

జగనన్న లే అవుట్లను సకల వసతులతో తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ఇప్పటికే 15వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో రెండు నెలల్లో 23 వేల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాం. వసతుల కల్పనలో రాజీ పడకుండా సమర్థంగా పర్యవేక్షిస్తూ చర్యలు చేపడుతున్నాం. స్వాగత ద్వారాల పనులు వారంలో ప్రారంభమవుతాయి.

– జి.వి.సూర్యనారాయణ, ఇన్‌చార్జి పీడీ, గృహ నిర్మాణ సంస్థ, కృష్ణాజిల్లా

మరిన్ని వార్తలు