బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

15 Sep, 2023 06:10 IST|Sakshi

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): విద్యార్థులను పరిశోధనా రంగం వైపు ప్రోత్సహిస్తూ, బాల శాస్త్రవేత్తలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు 31వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ను విజయవంతం చేయాలని ఎన్టీఆర్‌ జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక పిలుపునిచ్చారు. జిల్లా విద్యాశాఖాధికారి క్యాంప్‌ ఆఫీసులో గురువారం దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శుక్రవారం విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజీలో జరగనున్న ఓరియంటేషన్‌ కార్యక్రమానికి ప్రతి పాఠశాల నుంచి ఒక సైన్స్‌ టీచర్‌ హాజరై జిల్లా నుంచి అత్యుత్తమ ప్రాజెక్టులు తయారు చేయించాలని కోరారు. ఈ ఏడాది ఫోకల్‌ థీమ్‌ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవడం అని తెలిపారు. అలాగే మరో ఐదు సబ్‌ థీమ్స్‌లలో విద్యార్థులు సైన్స్‌ ప్రాజెక్టులు చేపట్టవచ్చని తెలిపారు. జిల్లా కో–ఆర్డినేటర్‌ మైనం హుస్సేన్‌, విజయవాడ డీవైఈఓ కుమార్‌, రిసోర్స్‌ పర్సన్స్‌ పాల్గొన్నారు.

జూనియర్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ విజేత కృష్ణాజిల్లా

కంకిపాడు: అంతర్‌ రాష్ట్ర నైన్‌ ఏ సైడ్‌ జూనియర్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ విజేతగా కృష్ణాజిల్లా జట్టు నిలిచింది. మండలంలోని ఈడుపుగల్లులోని నలంద విద్యానికేతన్‌లో రాష్ట్రస్థాయి నైన్‌ ఏ సైడ్‌ జూనియర్స్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ గురువారం నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ఫుట్‌బాల్‌ జట్లు టోర్నమెంట్‌కు హాజరయ్యారు. హోరాహోరీగా సాగిన పోటీలో విజేతగా కృష్ణాజిల్లా జట్టు నిలిచింది. రెండో స్థానంలో నంద్యాల జిల్లా జట్టు నిలవగా, మూడో స్థానంలో పశ్చిమగోదావరి, నాలుగో స్థానంలో ఎన్టీఆర్‌ జిల్లా జట్లు నిలిచాయి. విజేతలకు నలంద విద్యానికేతన్‌ కరస్పాండెంట్‌ సుధ, ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఈ.నరేష్‌, జిల్లా కార్యదర్శి వెంకటేష్‌ బహుమతులు అందించారు. పోటీలను పాఠశాల ప్రిన్సిపాల్‌ పద్మావతి, వ్యాయామ ఉపాధ్యాయులు పర్యవేక్షించారు.

దుర్గమ్మకు

బంగారపు గొలుసు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు మహారాష్ట్రకు చెందిన మహారాష్ట్ర ఉప్పుగుండూరి ఎల్‌డీపీ శ్రీనివాస్‌, సునీత, ఇతర కుటుంబ సభ్యులు ఈవో భ్రమరాంబను కలిసి సుమారు రూ.1.44 లక్షల విలువైన 24 గ్రాముల బంగారపు గొలుసును కానుకగా సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

రెండు వెండి గంగాళాలు

బహూకరణ

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు విజయవాడ కొత్తపేటకు చెందిన నోరి రామకృష్ణశాస్త్రి కుటుంబం 2.145 కిలోల వెండితో తయారు చేయించిన రెండు వెండి గంగాళాలను ఆలయ అధికారులకు అందజేశారు. అమ్మవారి మహా నివేదనకు ఈ వెండి గంగాళాలను వినియోగించాల్సిందిగా దాతలు కోరారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించి, ప్రసాదాలను అందజేశారు.

నేడు మిర్చి యార్డు పాలకవర్గ సమావేశం

కొరిటెపాడు : గుంటూరు మార్కెట్‌ యార్డు పాలకవర్గ సమావేశం చైర్మన్‌ నిమ్మకాయల రాజనారాయణ అధ్యక్షతన శుక్రవారం జరుగుతుందని మార్కెట్‌ యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి గురువారం తెలిపారు.

మరిన్ని వార్తలు