వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

25 Sep, 2023 08:07 IST|Sakshi

నల్గొండ: అదనపు కట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చల్లపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం స్థానిక సన్‌ఫ్లవర్‌ కాలనీలో నివసిస్తున్న లక్ష్మీపురం వీఆర్వో బెల్లంకొండ గోపీకృష్ణ భార్య అవిల (28) ఆదివారం మధ్యాహ్నం తన ఇంట్లోని బెడ్‌ రూమ్‌లో ఆత్మహత్య చేసుకుంది. గోపీకృష్ణకు, బందరు మండలం బీవీతోట పంచాయతీ సీతారామపురం గ్రామానికి చెందిన మట్టా వెంకటేశ్వరరావు కుమార్తె అవిలతో వివాహమైంది. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. వీరు ఇటీవల సన్‌ఫ్లవర్‌ కాలనీలో ఇల్లు కొనుగోలు చేసి నూతన ఇంట్లో కాపురం ఉంటున్నారు.

ఆదివారం మధ్యాహ్నం అవిల తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన సమయంలో గోపీకృష్ణ భోజనం చేస్తుండగా తమ కుమార్తె గురించి అడిగారు. బెడ్‌రూమ్‌లో ఉన్నట్లు చెప్పాడు. తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటం గమనించి కంగారుగా కిటికీలో నుంచి చూడగా, అప్పటికే అవిల ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే గోపీకృష్ణకు విషయం చెప్పటంతో బెడ్‌రూమ్‌ తలుపులు పగుల గొట్టి అవిలను కిందకు దించి చూడగా అప్పటికే అవిల మృతి చెందింది.

తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు
కొంతకాలంగా గోపీకృష్ణ అవిలను అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని మృతురాలి తండ్రి మట్టా వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో పెద్దల సమక్షంలో రాజీ చేయగా, నెల రోజుల నుంచి గోపీకృష్ణ మళ్లీ వేధింపులు ప్రారంభించాడని తెలిపాడు. భర్త్త గోపీకృష్ణ, అతని అన్న, తల్లి, మేనమామ, మేనమామ భార్య వేధించేవారని పేర్కొన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సీహెచ్‌ చినబాబు తెలిపారు.

మరిన్ని వార్తలు