బ్యాడ్మింటన్‌ పోటీలకు రాష్ట్ర జట్ల ఎంపిక

10 Nov, 2023 04:48 IST|Sakshi
ఎంపికై న బాలుర జట్టు

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడలో డిసెంబర్‌ 11 నుంచి 16 తేదీ వరకు జరగనున్న అండర్‌–19 స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్‌ జట్టులోని క్రీడాకారుల ఎంపికను పూర్తి చేశామని ఆంధ్రప్రదేశ్‌ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి జి.భానుమూర్తి రాజు తెలిపారు. చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్‌ స్టేడియం ఆవరణలో వివిధ జిల్లాల నుంచి హాజరైన క్రీడాకారులకు గురువారం పోటీలను నిర్వహించి ఎంపిక చేశారు.

టెలికం వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యం

ట్రాయ్‌ ప్రాంతీయ కార్యాలయ సలహాదారు ప్రవీణ్‌కుమార్‌

రామవరప్పాడు(గన్నవరం): టెలికంం వినియోగదారుల రక్షణ, సౌకర్యాల కల్పనకు అనేక చర్యలు తీసుకుంటున్నామని ట్రాయ్‌ ప్రాంతీయ కార్యాలయ సలహాదారు బి. ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. విజయవాడ రూరల్‌ మండలం ఎనికేపాడులోని ఎస్సార్కే ఇంజినీరింగ్‌ కళాశాలలో గురువారం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో టెలికాం వినియోగదారులకు వారి హక్కులు, అధికారాల గురించి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ టెలికాం ప్రాంతీయ కార్యాలయం విధులు, వినియోగదారుల రక్షణ గురించి తీసుకుంటున్న కార్యక్రమాల గురించి వివరించారు. టెలి కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌ (డీఓటీ) మనోజ్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రజల్లో సెల్‌ టవర్ల రేడియేషన్‌పై అనేక అపోహలున్నాయన్నారు. ఈ అపోహలు తొలగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐటీఎస్‌ జాయింట్‌ అడ్వైయిజర్‌ వీఎస్‌ రాజు, కళాశాల ప్రిన్సిపాల్‌ ఏకాంబరం నాయుడు, ఈసీఈ విభాగాధిపతి శ్రీ గౌరి, ఏఓ ప్రతాప్‌, సీఎజీ సభ్యులు పాల్గొన్నారు.

ఆస్తి కాజేసేందుకు ప్రయత్నించిన వ్యక్తికి ఐదేళ్ల జైలు

గన్నవరం: డాక్యుమెంట్‌లో మార్పులు చేసి ఆస్తిని కాజేసేందుకు ప్రయత్నించిన వ్యక్తికి ఐదేళ్లు జైలుశిక్ష, రూ. 10 వేలు జరిమానా విధిస్తూ గన్నవరం 12వ అదనపు మేజిస్ట్రేట్‌ కోర్టు గురువారం తీర్చు ఇచ్చింది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వి. ప్రసన్న సమాచారం ప్రకారం.. విజయవాడ రూరల్‌ మండలం గూడవల్లికి చెందిన దేవరపల్లి టానీకి ఆమె తండ్రి సొంగా రాజరత్నం నుంచి 1.13 ఎకరాలు భూమి సంక్రమించింది. సదరు భూమిలో 50 సెంట్లు కుమారుడు విజయవర్మ, కుమార్తెలకు గిఫ్ట్‌డీడ్‌ రిజిస్ట్రేషన్‌ చేయగా, మిగిలిన భూమి ఆమె పేరునే ఉంది. అయితే టానీ 2012లో మృతి చెందగా, సొంగా క్రిస్టియన్‌ అనే వ్యక్తి ఆస్తిలో వాటా ఉందంటూ దొంగ డాక్యుమెంట్లు సృషించారని విజయవర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణ 12వ ఏఎంఎం కోర్టులో కొనసాగుతుండగా నేరం రుజువు కావడంతో సొంగా క్రిస్టియన్‌కు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.

ఆతిథ్య రంగం క్రియాశీలక పాత్ర

విజయవాడ హోటల్స్‌ అసోసియేషన్‌ కార్యాలయం ప్రారంభం

ఆటోనగర్‌(విజయవాడతూర్పు): దేశస్థూల జాతీయ ఉత్పత్తిలో ఆతిఽథ్య రంగం క్రియాశీలక పాత్ర పోషిస్తుందని దక్షిణ భారత హోటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.శ్యాంరాజు అన్నారు. విజయవాడ హోటల్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక భారతీనగర్‌లో గురువారం నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్యాంరాజు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచి.. అభివృద్ధి చేస్తే విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి సందర్శకుల తాకిడి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. హోటల్స్‌, రెస్టారెంట్‌ ద్వారా 18 శాతం ప్రభుత్వానికి పన్నుల రూపంలో జమ అవుతుందని చెప్పారు. సింగిల్‌ విండో ద్వారా లైసెన్స్‌ జారీని సులబభతరం చేయాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌వీ స్వామి మాట్లాడుతూ కోవిడ్‌ తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో హోటల్స్‌, రిసార్టులు మళ్లీ సాధారణ స్థాయికి చేరుకున్నాయన్నారు. వచ్చే ఏడాది 2024న విశాఖపట్నం వేదికగా దక్షిణ భారత హోటల్స్‌ అసోసియేషన్‌ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఆతిథ్య రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వాలనే అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించేందుకు ప్రయత్నిస్తామన్నారు. రాత్రి 12 గంటల వరకు హోటళ్లు తెరిచి ఉంచేలా జారి చేసిన జీఓ అమలుకు ఆదేశాలు కోరుతామన్నారు. కార్యక్రమంలో మురళీ ఫార్చ్యూన్‌ అధినేత ముత్తవరపు మురళీకృష్ణ, లెమన్‌ ట్రీ అధినేత గోకరాజు గంగరాజు, గ్రేట్‌ హోటల్‌ అధినేత ఎం.రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు