పూర్తి ఆరోగ్యవంతులుగా చేయాలి

10 Nov, 2023 04:48 IST|Sakshi
మాట్లాడుతున్న కలెక్టర్‌ ఢిల్లీరావు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల ద్వారా గుర్తించిన రిఫరల్‌ కేసులకు పూర్తి స్థాయి వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు. వారి చేయి పట్టి నడిపించి పూర్తి ఆరోగ్యవంతులు అయ్యేలా చూడాలన్నారు. గురువారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో రిఫరల్‌ కేసులపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. తదుపరి చికిత్స అవసరమయ్యే రోగులకు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు, సర్వజన ఆస్పత్రులు, బోధనాస్పత్రులు తదితరాల ద్వారా అవసరమైన చికిత్స అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశం చేశారు. చికిత్స అనంతరం సరిగా మందులు తీసుకోవడం, సమయానికి డాక్టర్‌ వద్దకు వెళ్లడం తదితర ఫాలోఅప్‌ సేవలు అందించేందుకు ఏఎన్‌ఎం, మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు, ఆశా కార్యకర్తలు కృషిచేయాలని సూచించారు. రిఫరల్‌ కేసులను మ్యాప్‌ చేసిన ఆస్పత్రుల్లో చేర్చి, అవసరమైన చికిత్స అందించేందుకు జిల్లా, మండల, టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు సమన్వయంతో పనిచేస్తూ చికిత్స విధానాన్ని పర్యవేక్షించాలన్నారు. రిఫరల్‌ కేసుల వివరాలను యాప్‌లో నమోదు చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ అనుబంధ ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రత్యేక వైద్య నిపుణుల చేత రిఫరల్‌ కేసులకు వైద్య సేవలు అందించేలా చూడాలన్నారు. డీఎంహెచ్‌ఓ సుహాసిని, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు, డీసీహెచ్‌ఎస్‌ బీసీకే నాయక్‌, ఆరోగ్య సురక్ష నోడల్‌ అధికారి మోతీబాబు, తదితరులు పాల్గొన్నారు.

‘సురక్ష’ రిఫరల్‌ కేసులపై ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ సమీక్ష

మరిన్ని వార్తలు