కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌రూమ్‌ల ఏర్పాటుకు చర్యలు

10 Nov, 2023 04:48 IST|Sakshi

జూపూడి(ఇబ్రహీంపట్నం): రానున్న సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌రూమ్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు చెప్పారు. మండలంలోని నిమ్రా ఇంజినీరింగ్‌ కళాశాలలో జాయింట్‌ కలెక్టర్‌ సంపత్‌కుమార్‌, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జాయింట్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌తో కలసి భవనాలు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ గతంలో కానూరు పీవీపీ సిద్ధార్థ కళాశాలలో స్ట్రాంగ్‌, కౌంటింగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాల పునర్విభజనతో ఎన్టీఆర్‌ జిల్లాలో స్ట్రాంగ్‌, కౌంటింగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడ పార్లమెంట్‌ ని యోజకవర్గం పరిధిలో 1781 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా పార్లమెంట్‌కు ఒకటి, 7 అసెంబ్లీ నియోజకవ ర్గాలకు ఒక్కొక్కటి చొప్పున కౌంటింగ్‌ కేంద్రాలు, అదే ప్రాంగణంలో 3,562 ఈవీఎంలు భద్రపర్చేందుకు భవనాలు గుర్తించాలన్నారు. మేరీస్టెల్లా కళాశాలతో పాటు నిమ్రా కళాశాల భవనాలు పరిశీస్తున్నట్లు తెలిపారు. అనుకూలమైన భవనాలు గుర్తించి రాష్ట్ర ఎన్నికల అధికారికి నివేదిక ఇస్తామన్నారు. డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు, ఎన్నికల సూపరింటెండెంట్‌ దుర్గాప్రసాద్‌, తహసీల్దార్‌ శ్రీనివాసరావు, నిమ్రా కళాశాల అకడమిక్‌ డైరెక్టర్‌ టి.నారాయణమూర్తి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు