ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా జగన్‌ వెంటే..

10 Nov, 2023 04:48 IST|Sakshi

పామర్రు: రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు చూసి ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా నేడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలసి నడుస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు. పామర్రులో సామాజిక సాధికార బస్సుయాత్రను పురస్కరించుకుని గురువారం స్థానిక ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ముఖ్యమంత్రులు ఖద్దరు చొక్కా నలగకుండా తిరిగేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నుంచి మంత్రులు, ఎమ్మెల్యే వరకూ సామాన్య ప్రజల మధ్య ఉంటూ వారి సాధక బాధకాలు తెలుసుకుని పనిచేస్తున్నట్టు చెప్పారు. చీఫ్‌ మినిస్టర్‌ టు కామన్‌మాన్‌ అని సీఎం జగన్‌ నిరూపించారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 60 శాతం పదవులు కట్టబెట్టి సామాజిక సాధికారతకు సీఎం జగన్‌ నిలువుటద్దంగా నిలిచారని కొనియాడారు. ఆయన పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా తలెత్తుకు తిరుగుతున్నామని, ఇది తమకెంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. గత నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తోందన్నారు.

ముఖ్యమంత్రికి బ్రహ్మరథం

సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీలపై చూసిన చిన్నచూపు, చీదరించుకున్న తీరును గ్రహించిన ఆయా వర్గాల ప్రజలు జగన్‌ మోహన్‌రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నట్టు చెప్పారు. చంద్రబాబు గజదొంగని ఆయన చేసే కుట్రలు, కుతంత్రాల మాయలో పడొద్దని సీఎం జగన్‌కు మళ్లీ అధికారం కట్టబెట్టేందుకు ప్రతిఒక్కరం సైనికుల్లా పనిచేద్దామని పిలుపు నిచ్చారు. ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నాలుగున్నరేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు ఎంతో సంతోషంతో ఉన్నారని చెప్పారు. మహిళలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 60 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ దేశంలోనే గొప్ప ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారని అన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌, అవనిగడ్డ, పెనమ లూరు, గుంటూరు ఈస్ట్‌ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్‌బాబు, కొలుసు పార్థసారథి, మొహమ్మద్‌ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

మంత్రి జోగి రమేష్‌

మరిన్ని వార్తలు