14 నుంచి నాగుల చవితి మహోత్సవాలు

10 Nov, 2023 04:48 IST|Sakshi
కరపత్రాలు ఆవిష్కరిస్తున్న ఆలయ ఏసీ చక్రధరరావు, ప్రధానార్చకుడు పవన్‌కుమార్‌ శర్మ

మోపిదేవి(అవనిగడ్డ): మండల కేంద్రమైన మోపిదేవిలోని శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 14వ తేదీ నుంచి నాగుల చవితి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తామని ఆలయ ఏసీ ఎన్‌.ఎస్‌.చక్రధరావు తెలి పారు. దేవస్థానంలో ఆయన ఉత్సవాల కరపత్రాలను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చవితి మహోత్సవాలు 14 నుంచి డిసెంబర్‌ 12వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. కార్తిక మాసం నెల రోజులు పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అభిషేకాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. నాగుల చవితి సందర్భంగా 17వ తేదీ తెల్లవారుజాము 2.30 గంటలకు పుట్ట వద్ద పూజలు నిర్వహించి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. 26వ తేదీ సాయంత్రం 6.45 గంటలకు జ్వాలా తోరణం అనంతరం భక్తులకు నాగపుట్ట దర్శనం ఉంటుందని వివరించారు. ఈ నెల 14 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు రోజూ ఉదయం ఆరు గంటలకు గర్భాలయంలో కార్తిక మాస దీక్ష అభిషేకాలు జరుగుతాయని వివరించారు. రూ.1,116 చెల్లించిన భక్తుల గోత్ర నామాలతో నిత్యం పరోక్షంగా పూజలు చేస్తామని తెలిపారు. డిసెంబర్‌ 11వ తేదీన శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లోక కల్యాణార్థం లక్ష బిల్వార్చన అత్యంత వైభవంగా జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు బుద్దు పవన్‌కుమార్‌ శర్మ, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు