చిరు జల్లులతో రైతుల్లో గుబులు

21 Nov, 2023 01:30 IST|Sakshi

కంకిపాడు: ఖరీఫ్‌ వరి పంట చేతికందే తరుణంలో వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్మేసింది. పలు చోట్ల అక్కడక్కడా జల్లులు కురిశాయి. ఇప్పటికే రైతులు వరి పంట కోతకోసి బహిరంగ ప్రదేశాల్లో ఆరబోసుకున్నారు. మరికొన్ని చోట్ల కూలీలతో కోత కోయించటంతో పనలు పొలాల్లో ఉన్నాయి. వాతావరణం మబ్బులు కమ్మటంతో పాటుగా చిరుజల్లులు కురవటంతో ఆరబోసిన ధాన్యం రాశులుగా ఎత్తి తడిచిపోకుండా పరదాలు కప్పుకున్నారు. తడిచిన వరి పనలను ఆరబెట్టే ప్రయత్నం చేశారు. మబ్బులు, చలిగాలులు కొనసాగుతుండటంతో రైతుల్లో గుబులు రేగుతోంది.

కొండలమ్మకు రూ.26.17 లక్షల ఆదాయం

గుడ్లవల్లేరు: కొండలమ్మ అమ్మవారి ఆలయంలో భక్తులు వేసిన కానుకలను తనిఖీ అధికారి కె.వి.గోపాలరావు సమక్షంలో సోమవారం లెక్కించారు. 57 రోజులకు గాను రూ.26,17,186 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ కానూరి సురేష్‌, చైర్మన్‌ శేషం గోపి తెలిపారు. అలాగే ఐదు గ్రాముల బంగారంతో పాటు 193 గ్రాముల వెండి కానుకల కింద వచ్చాయన్నారు. కార్యక్రమంలో ధర్మకర్తలు పామర్తి వెంకటస్వామి, కొమ్మనబోయిన రవిశంకర్‌, వల్లూరు వెంకట్రావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు