-

30న బందరుకు గవర్నర్‌ రాక

28 Nov, 2023 01:42 IST|Sakshi

చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఈ నెల 30వ తేదీన మచి లీపట్నం రానున్నట్లు కృష్ణా కలెక్టర్‌ పి. రాజాబాబు వెల్లడించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ఆయన అధికారులతో మాట్లాడుతూ బందరు మండలం మేకవానిపాలెంలో జరిగే గ్రామసభలో గవర్నర్‌ పాల్గొంటారన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్‌ సమాన్‌, ఆయుష్మాన్‌ భారత్‌, పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన, పీఎం ఆవాస్‌ యోజన, పీఎం విశ్వకర్మ తదితర పథకాల లబ్ధిదారుల జాబితా, వారికి అందిన ఆర్థిక సాయం వివరాలతో మండలాల వారీగా అధికారులు సమాచారంతో సిద్ధంగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. వాటిని ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఏ పేరుతో పిలుస్తారో ఆ పేరును తెలి యజేయాల్సి ఉంటుందన్నారు. లబ్ధిదారులతో గవర్నర్‌ ముఖాముఖి మాట్లాడతారన్నారు. విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదా రిలో ఎక్కడా చెత్త, చెదారం కనిపించకుండా శుభ్రంగా ఉంచాలన్నారు. ఉయ్యూరు ఆర్డీఓ, మునిసిపల్‌, పంచాయతీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. డీఆర్వో పెద్ది రోజా, ఎంయూడీఏ వీసీ రాజ్యలక్ష్మి, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, డీపీఓ నాగేశ్వరనాయక్‌ పాల్గొన్నారు.

ఐఎంఏ క్రీడల్లో డాక్టర్‌ రవికి నాలుగు పతకాలు

లబ్బీపేట(విజయవాడతూర్పు): దేశంలోనే తొలిసారిగా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐఎంఏ జాతీయ క్రీడా పోటీల్లో విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఈఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్‌ కొణిదె రవి నాలుగు పతకాలు సాధించారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం సమీపంలో నిర్వహించిన అథ్లెటిక్స్‌లో సత్తాచాటిన డాక్టర్‌ రవి రెండు బంగారు, రెండు రజత పతకాలు గెలుపొందారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రవికి సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కంచర్ల సుధాకర్‌, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ డి.వెంకటేష్‌, సహచర వైద్యులు సోమవారం అభినందనలు తెలిపారు.

తెలుగు ఉపాధ్యాయుడికి కళామిత్ర పురస్కారం

ఇబ్రహీంపట్నం(మైలవరం): మండలంలోని కొండపల్లి జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న దామెర్ల నరసింహారావును తెలుగుమిత్ర అవార్డు– 2023 వరించింది. కళామిత్ర మండలి 17వ వార్షికోత్సవం సందర్భంగా ఒంగోలులో ఆది వారం జరిగిన కార్యక్రమంలో ఆయనకు అవార్డు అందజేసి సత్కరించారు. విద్యార్థుల్లో సాహిత్యం, తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన నరసింహారావును అవార్డు వరించడం అభినందనీయమని అవార్డు కమిటీ చైర్మన్‌ తేళ్ల అరుణ పేర్కొన్నారు.

యార్డుకు 35,423

బస్తాల మిర్చి రాక

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డుకు సోమవారం 35,423 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్‌ విధానం ద్వారా 34,308 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్‌ ఏసీ కామన్‌ రకం 334, నంబర్‌–5, 273, 341, 4884, సూపర్‌–10 రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ.22,000 వరకు పలికింది. నాన్‌ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్‌ రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి 24,500 వరకు లభించింది. ఏసీ కామన్‌ రకం క్వింటాలుకు రూ.8,500 నుంచి రూ.21,000 వరకు పలికింది. ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ.9,000 నుంచి 23,500 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.13,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 11,420 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు