-

ఒరుపులోనూ వరించింది!

28 Nov, 2023 01:42 IST|Sakshi
నెప్పల్లి సెంటర్‌లో వరి పంట కోత కోస్తున్న కూలీలు

అవనిగడ్డ: కృష్ణాజిల్లాలో వరి దిగుబడి గతంలో కంటే బాగా పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఎకరాకు ఐదు బస్తాలకు పైగా దిగుబడి పెరగనుండటంతో రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. జిల్లాలో పలు ప్రాంతాల్లో యంత్రాలతో వరి నూర్పిడిలు, వరికోతలు ఊపందుకున్నాయి.

ఈ ఏడాది ఒరుపు పంట..

జిల్లాలో ఈ ఏడాది రైతులకు ఒరుపు పంట చేతికందనుంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీప్‌లో 3.69లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. గత నాలుగేళ్లతో పోలిస్తే ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా నమోదయ్యాయి. అయినప్పటికీ ప్రణాళికాబద్ధంగా పంటకాలువల ద్వారా సాగునీటిని విడుదల చేయడం వల్ల రైతులకు ఇబ్బందులు లేకుండా చేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంక, కోడూరు మండలాల్లో వంతుల వారీ విధానంతో పాటు ఇరిగేషన్‌ అధికారులు రాత్రి వేళలో పంటకాలువలపై పర్యవేక్షణ చేశారు. దీంతో దిగుబడులు పెరిగాయని రైతులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం వరిపంటకు చీడపీడలు, తెగుళ్లు కూడా తక్కువగా వచ్చాయి. దోమ, పురుగు తక్కువగా ఉండటంతో ఏటా నాలుగైదు సార్లు పురుగు మందులు పిచికారీ చేసే రైతులు ఒకటి రెండు సార్లతో సరిపెట్టేశారు.

ఎకరాకు ఐదు బస్తాలకు పైగా..

జిల్లాలో పలుచోట్ల ఇప్పటికే యంత్రాల ద్వారా వరి నూర్పిళ్లు చేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో కూలీలతో కోతలు కోయిస్తున్నారు. గత ఏడాది 30 నుంచి 35 బస్తాల దిగుబడి రాగా, ఈ సంవత్సరం 35 నుంచి 40 బస్తాల దిగుబడి వస్తుందని రైతులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కంటే ఎకరాకు ఐదు బస్తాలకు పైగా దిగుబడి పెరుగుతుందని కొంతమంది రైతులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10.52లక్షల టన్నులు దిగుబడి వస్తుందని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పటికీ వరి దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఎకరాకు 40 బస్తాల దిగుబడి కృష్ణా జిల్లాలో 3.69 లక్షల ఎకరాల్లో వరిసాగు 10.52లక్షల టన్నులు దిగుబడులు అంచనా హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

మార్కెట్‌కు చేరుతున్న ధాన్యం

కంకిపాడు(పెనమలూరు): వాతావరణం మబ్బులు పట్టి ఉన్నా రైతులు వరి కోతలను వేగంగా చేపడుతున్నారు. వరి కోత యంత్రాల ద్వారా కోత కోయించి, ధాన్యాన్ని బహిరంగ ప్రదేశాలు, రోడ్డు మార్జిన్‌లకు తరలిస్తున్నారు. ధాన్యం ఆరబోసి, ఆర్‌బీకే కేంద్రాల ద్వారా మిల్లులకు పంపుతున్నారు. ధాన్యం తరలింపునకు అవసరమైన గోనె సంచులు కూడా మార్కెట్‌యార్డు, మిల్లుల వద్ద నిల్వ చేసి ఉంచారు.

మరిన్ని వార్తలు