-

రోగ నిర్ధారణలో బెస్ట్‌

28 Nov, 2023 01:42 IST|Sakshi
24 గంటల ల్యాబ్‌లో పరీక్ష చేస్తున్న టెక్నీషియన్‌

లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగా విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్‌)కి అత్యాధునిక పరికరాలను సమకూర్చింది. ఆస్పత్రికి వచ్చిన వారికి కచ్చితమైన వ్యాధి నిర్ధారణ చేయడమే కాకుండా, అరుదైన జబ్బులకు విజయవంతంగా చికిత్స అందుతోంది. దీంతో ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య రెట్టింపైంది. నిపు ణులైన వైద్యుల పర్యవేక్షణలో 24 గంటలూ వ్యాధి నిర్ధారణ సేవలు అందుబాటులోకి రావడంతో క్లిష్టతరమైన సమస్యలతో వచ్చిన వారికి సైతం సత్వరమే మెరుగైన వైద్యం అందుతోంది. ఫలితంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతోంది.

నాలుగున్నరేళ్లలో పురోగతి

ఒకప్పుడు జీజీహెచ్‌లో వ్యాధి నిర్ధారణ పరీక్షల ఫలితాలు కోసం రెండు, మూడు రోజుల సమయం పట్టేది. ఈ రోజు బ్లడ్‌శ్యాంపిల్‌ ఇస్తే, రిపోర్టుల కోసం మరుసటి రోజు ఆస్పత్రికి రాక తప్పేది కాదు. ప్రస్తుతం అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో వేగంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. శ్యాంపిల్‌ ఇచ్చిన రోజే ఫలితాలను ఇచ్చేస్తున్నారు. దీంతో జబ్బులకు చికిత్స చేయడంలో జాప్యాన్ని తగ్గించగలిగారు.

వైద్యుల పర్యవేక్షణలో నిర్ధారణ

బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, పాథాలజీ విభాగాల్లో ప్రొఫెసర్‌లతో పాటు, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు అందుబాటులో ఉన్నారు. ఆస్పత్రిలో చేసే ప్రతి వ్యాధి నిర్ధారణ పరీక్షను వైద్యుల పర్యవేక్షణలోనే చేస్తుంటారు. ఏదైనా నిర్ధారణ అనుమానాస్పదంగా ఉంటే, ప్రొఫెసర్‌లు సైతం చూస్తుంటారు.

ఆధునిక పరికరాలు

మైక్రో బయాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ విభాగాల్లో అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. బయోకెమిస్ట్రీ విభాగంలో ఏర్పాటు చేసిన క్లియా మెషిన్‌తో అన్ని రకాల బయో కెమికల్‌ పరీక్షలను వేగంగా చేసి, కచ్చి తమైన ఫలితాలు ఇవ్వగలుగుతున్నారు. పాథాలజీ విభాగంలో సైతం అధునాతన మెక్రోస్కోప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఆ విభాగంలో ప్రభుత్వాస్పత్రిలోని రోగులకు సంబంధించినవే కాకుండా, బయాప్సీ పరీక్షల కోసం నగరంలోని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల నుంచి సైతం శ్యాంపిల్స్‌ వస్తుంటాయి.

రేడియాలజీ విభాగంలో..

ప్రస్తుతం అత్యాధునిక పరిజ్ఞానం కలిగిన 1.5 టెస్లా ఎంఆర్‌ఐ స్కానింగ్‌ యంత్రం, 256 స్లైస్‌ సీటీస్కాన్‌ అందు బాటులో ఉంది. ఈ రెండు ప్రస్తుత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినవే. వీటితో పాటు 12 అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ యూనిట్‌లు, అత్యాధునిక డిజిటల్‌ ఎక్స్‌రే యూనిట్‌లు అందు బాటులో ఉన్నాయి. నిత్యం 200 నుంచి 250 మందికి అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌లు చేస్తుంటారు. 120 నుంచి 150 వరకూ సీటీ స్కాన్‌లు, 25 నుంచి 30 మందికి ఎంఆర్‌ఐ స్కానింగ్‌లు చేస్తూ రిపోర్టులు అందిస్తుంటారు.

విజయవాడ జీజీహెచ్‌లో అత్యాధునిక వ్యాధి నిర్ధారణ పరికరాలు మైక్రో బయాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, రేడియాలజీ విభాగాలు కార్పొరేట్‌ ఆస్పత్రులకు మించి సౌకర్యాల కల్పన

మరిన్ని వార్తలు