-

కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని సాగనంపాలి

28 Nov, 2023 01:44 IST|Sakshi
రైతు, కార్మిక సంఘాల మహాధర్నాలో నేతలు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని రైతు, కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. తొమ్మిదిన్నరేళ్లుగా అమలు చేసిన విధానాలు దేశం పైన, ప్రజల పైన తీవ్ర దుష్ప్రభావాన్ని చూపాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ విధానాలు మార్చిదేశాన్ని, ప్రజలను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. విజయవాడలోని జింఖానా మైదానంలో రైతు సంఘాల సమన్వయ సమితి, కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న మహాధర్నా సోమవారం ప్రారంభమైంది. తొలుత ఇటీవల మృతి చెందిన ఎమ్మెస్‌ స్వామినాథన్‌, రైతు సంఘాల నాయకులు యెర్నేని నాగేంద్రనాథ్‌లకు సంతాపం తెలియజేశారు. మహాధర్నాలో పాల్గొన్న మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. రైతాంగ ఆత్మహత్యలే ఇందుకు నిదర్శమని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం మొత్తం మీద లక్షన్నరమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతుందని ధ్వజమెత్తారు. తక్షణమే మోడీని గద్దెదించాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు లాంటి సంస్థను పోస్కోకి కట్టబెట్టడం కార్మికుల జీవితాన్ని నాశనం చేయడమే అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య, ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక నాయకులు చుండూరు రంగారావు, కార్మిక సంఘాల నాయకులు జాస్తి కిషోర్‌, ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ఆళ్ళ వెంకటగోపాలకృష్ణారావు, రెతుసంఘం సీనియర్‌ నాయకులు వై.కేశవరావు, కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు, శ్రామిక మహిళ రాష్ట్ర కన్వీనర్‌ కె. ధనలక్ష్మి, విద్యార్థి, కార్మిక, యువజన, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మహాధర్నాలో సంఘీభావం వ్యక ్తం చేస్తున్న కార్మిక, కర్షక సంఘాల నాయకులు

మరిన్ని వార్తలు