మతోన్మాద శక్తులను ఐక్యంగా ఎదుర్కోవాలి

29 Nov, 2023 01:42 IST|Sakshi
చల్లపల్లిలో విప్లవ గీతాలు ఆలపిస్తున్న విమలక్క

చల్లపల్లి: దేశంలో మనువాద, మతోన్మాద శక్తులు పేట్రేగిపోయి సామాన్య ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయని, వారిని ఎదుర్కొనేందుకు ప్రజలు ఐక్యం కావాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏపీ, తెలంగాణ రాష్ట్రాల చైర్‌పర్సన్‌ విమలక్క అన్నారు. స్థానిక సీఆర్‌ వికాస కేంద్రంలో ఏపీ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం చండ్ర పుల్లారెడ్డి 39వ వర్థంతి, అమరుల సంస్మరణ సభ, పురవీధుల్లో స్మారక ర్యాలీ నిర్వహించారు. ముఖ్య వక్తగా విచ్చేసిన విమలక్క మాట్లాడుతూ దేశంలో కార్పొరేట్‌ కంపెనీలకు కేటాయించేందుకు వేల ఎకరాల భూములు ఉంటాయి కానీ, పేదలకు సెంటు భూమి ఇచ్చేందుకు స్థలం పాలకులకు దొరకట్లేదన్నారు. చండ్ర పుల్లారెడ్డి నిర్మించిన ప్రతిఘటన పోరాటంలో అమరులైన వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ ప్రాంతంలో జరిగిన భూ పోరాటాల్లో ప్రాణాలు కోల్పోయిన అమర వీరులను స్మరించుకున్నారు. ఏపీరైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు సింగోతు నాగేంద్రరావు అధ్యక్షతన జరిగిన సంస్మరణ సభలో ఏపీఆర్‌సీఎస్‌ రాష్ట్ర నాయకులు కొండా దుర్గారావు, కొల్లేరు పోరాట నాయకురాలు ఘంటసాల వెంకటలక్ష్మి, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోవా గోవర్థన్‌, ఏఐఎఫ్‌టీయూ, ఆర్‌సీసీ, రైతు కూలీ సంఘం నాయకులు పాల్గొన్నారు. విమలక్క, ప్రజా కళాకారులు విప్లవ గీతాలు ఆలపించి ఆకట్టుకున్నారు.

కొండ చిలువల కలకలం

ఇబ్రహీంపట్నం/వీరులపాడు: మైలవరం, నందిగామ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో మంగళవారం రెండు కొండ చిలువలు కలకలం రేపాయి. ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్డు వసంత కాలనీలో కనిపించిన కొండచిలువను చూసిన స్థానికులు స్నేక్‌ క్యాచర్‌కు ఫోన్‌లో సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ కొండచిలువను చాకచక్యంగా పట్టుకుని సంచిలో బంధించారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వీరులపాడు మండలంలోని వెల్లంకి గ్రామ శివారులో మంగళవారం రాత్రి భారీ కొండచిలువ కనిపించటంతో ప్రజలు భయాందోళన చెందారు. రాత్రి సమయంలో సుబాబుల్‌ ముఠా కూలీలు పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గ్రామ శివారులో 15 అడుగుల భారీ కొండ చిలువ కనిపించింది. దీంతో కూలీలు తమ వద్ద ఉన్న కర్రలతో కొండ చిలువను కొట్టి హతమార్చారు.

మరిన్ని వార్తలు