సైబర్‌ నేరగాళ్ల వలలో మత్స్యశాఖ అధికారి

29 Nov, 2023 01:42 IST|Sakshi

రూ.7.60 లక్షలు స్వాహా

పెనమలూరు: సైబర్‌ నేరగాళ్ల చేతిలో అధికారి మోసపోయి ఏకంగా రూ.7.60 లక్షలు సొమ్ము పోగొట్టుకున్నారు. సీఐ టీవీవీ రామారావు తెలిపిన వివరాల ప్రకారం పోరంకి ఫిషరీస్‌ కమిషనరేట్‌లో జాయింట్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ వి.వెంకటేశ్వరరావు పని చేస్తున్నారు. ఆయన పోరంకిలో నివాసం ఉంటున్నాన్నారు. ఆయనకు గత నెల 27వ తేదీన ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి వివరాలు తెలుపుతూ వెంకటేశ్వరరావు ఆధార్‌ కార్డుపై 67764 13665 ఫోన్‌ సిమ్‌ ఉందని తెలిపాడు. తాను సిమ్‌ తీసుకోలేదని వెంకటేశ్వరరావు తెలుపగా, ఈ సిమ్‌పై అనేక కేసులు ఉన్నాయని ముంబాయి నోవపాడ పోలీసులతో మాట్లాడాలని ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి ఎస్‌ఐ సందీప్‌రావ్‌కు లైన్‌ కలిపాడు. సిమ్‌పై మొత్తం 17 కేసులు ఉన్నాయని ఎస్‌ఐ తెలిపాడు. ముంబాయి బ్యాంక్‌లో రూ.2 కోట్లు మనీ లాండరింగ్‌ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని, దీనికి గాను రూ.40 లక్షలు కమీషన్‌ పొందావని అరెస్టు వారెంట్‌ ఉందని ఎస్‌ఐ బెదిరించాడు. తాను ఏదీ చేయలేదని వెంకటేశ్వరరావు వివరణ ఇచ్చాడు. తన ఉన్నతాధికారితో మాట్లాడమని స్కైప్‌ వివరాలు తీసుకున్నారు. ఆ తరువాత స్కైప్‌ ద్వారా సీబీఐ అధికారి అని ఆకాశ్‌కుల్‌హారి లైన్‌లోకి వచ్చాడు. తన వ్యక్తి గత వివరాలు చోరీ చేశారని వెంకటేశ్వరరావు సీబీఐ అధికారికి తెలిపాడు. విచారణలో భాగంగా బ్యాంక్‌ ఖాతాలో ఉన్న సొమ్ము కార్పొరేషన్‌ ఎకౌంట్‌ ఆఫ్‌ రిజర్వు బ్యాంకు ఆప్‌ ఇండియాకు పరిశీలను పంపాలని సూచించటంతో సైబర్‌ నేరగాళ్ల మాయమాటలు నమ్మి వెంకటేశ్వరరావు పలు దఫాలుగా గత నెల 30వ తేదీ నాటికి రూ.7.60 లక్షలు నేరగాళ్లు చెప్పిన బ్యాంక్‌ ఖాతాకు సొమ్ము పంపారు. అయితే ఆ తరువాత నేరగాళ్లు స్కైప్‌లో స్పందించకపోవటంతో మోసపోయానని గ్రహించిన వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేశారు.

మరో కేసులో రూ.3.25 లక్షలు స్వాహా

పెనమలూరు: సైబర్‌ నేరగాళ్లు ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి రూ 3.25 లక్షలు స్వాహా చేయటంతో పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ రామారావు తెలిపిన వివరాల ప్రకారం పెదపులిపాక గ్రామానికి చెందిన పోలవరపు జనార్దనరావు భార్య డాక్యుమెంట్లు అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచి పెదపులిపాక గ్రామానికి కొరియర్‌ చేసింది. జనార్దనరావు పార్సిల్‌ లోకేషన్‌ ట్రాకింగ్‌ పెట్టుకున్నాడు. అయితే పార్సిల్‌ బెంగళూరుకు వచ్చి తిరిగి అరుణాచల్‌ప్రదేశ్‌కు వెళ్తున్నట్లు ట్రాకింగ్‌లో చూపింది. దీంతో జనార్దనరావు ఈ నెల 24న కొరియర్‌ కన్సూమర్‌ కేర్‌కు ఫోన్‌ చేశాడు. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి ఫిర్యాదుకు ఐదు రూపాయలు చెల్లించాలని తెలుపగా ఫిర్యాదు చెల్లించాడు. అయితే ఆన్‌లైన్‌లో చెల్లింపు జరగక పోవటంతో ఫోన్‌లో వ్యక్తి ఏటీఎం కార్డు వివరాలు తీసుకున్నాడు. ఆ తరువాత పలు దఫాలుగా జనార్దనరావు బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.3.25 లక్షలు స్వాహా అయ్యాయి. దీంతో మోసపోయానని భావించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు