అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించండి

29 Nov, 2023 01:42 IST|Sakshi
మాట్లాడుతున్న పరిశీలకుడు శ్రీధర్‌, పక్కన కలెక్టర్‌ రాజాబాబు, డీఆర్వో రోజా

చిలకలపూడి(మచిలీపట్నం): ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమంలో ఎటువంటి అభ్యంతరాలు వచ్చినా వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించాలని ఏపీ పొల్యూషన్‌ బోర్డు మెంబర్‌ సెక్రటరీ, జిల్లా ఓటరు నమోదు పరిశీలకుడు బి.శ్రీధర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపుహాల్‌లో మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌ మాట్లాడుతూ.. ప్రతి ఏడాది ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరుగుతూ ఉంటుందని, అయితే ఈ ఏడాది నిర్వహించే ఓటర్ల నమోదు కార్యక్రమం ఎంతో కీలకమైనదన్నారు. ఈ తుది జాబితా ద్వారానే రానున్న సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు. ముసాయిదా జాబితా ఇప్పటికే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించామన్నారు. డిసెంబర్‌ 2, 3 తేదీల్లో పోలింగ్‌ కేంద్రాల్లో బూత్‌ లెవల్‌ అధికారుల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే తెలియజేయాలని సూచించారు. యువత ఓటు నమోదు చేసుకునేలా చూడాలన్నారు.

పారదర్శకంగా ఓటర్ల జాబితా సిద్ధం..

వైఎస్సార్‌ సీపీ మైనార్టీ విభాగం జోనల్‌ ఇన్‌చార్జి షేక్‌ సలార్‌దాదా మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారు ఉన్నారని వీటిపై దృష్టి సారించాలన్నారు. మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో మరణించిన, వలస వెళ్లిన వారు రెండు, మూడు చోట్ల ఓటర్లుగా నమోదై ఉన్నారని వీరిని పరిశీలించి కచ్చితమైన ఓటర్ల లిస్ట్‌ను తయారుచేయాలన్నారు. పలువురు నాయకులు వివిధ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్‌ రాజాబాబు మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాను బీఎల్‌ఓల ద్వారా పారదర్శకంగా పరిశీలించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 55,686 ఓట్ల తొలగింపునకు అప్‌లోడ్‌ చేశామని చెప్పారు. సమావేశంలో డీఆర్వో పెద్ది రోజా, వైఎస్సార్‌ సీపీ నాయకులు బందెల థామస్‌నోబుల్‌, కార్పొరేటర్‌ మేకల సుధాకర్‌బాబు, బూరగడ్డ రమేష్‌నాయుడు, చిటికిన నాగేశ్వరరావు, సీపీఎం నాయకుడు కొడాలి శర్మ, బీజేపీ నాయకులు పాండురంగారావు, ధూళిపాళ రామచంద్రరావు, ఆర్డీఓలు ఎం.వాణి, పి.పద్మావతి, దాసి రాజు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

ఓటర్ల నమోదు పరిశీలకుడు శ్రీధర్‌,

కలెక్టర్‌ రాజాబాబు

మరిన్ని వార్తలు