సెల్‌ఫోన్‌ వివాదం.. ఘర్షణలో వ్యక్తి మృతి

29 Nov, 2023 01:42 IST|Sakshi
సతీష్‌ మృతదేహం

గుడివాడరూరల్‌: సెల్‌ఫోన్‌ వివాదం నేపథ్యంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం గుడివాడలో చోటుచేసుకుంది. పట్టణంలోని ధనియాలపేటకు చెందిన రెడ్డి శ్రీను, తలగడదీవి సతీష్‌(34) ఇద్దరు స్నేహితులు. ఈ క్రమంలో రెడ్డి శ్రీను తన మొబైల్‌ ఫోన్‌ను సతీష్‌ వద్ద తాకట్టు పెట్టి కొంత డబ్బు తీసుకున్నాడు. ఈ క్రమంలో తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాను మొబైల్‌ ఫోన్‌ ఇవ్వాల్సిందిగా సతీష్‌ను శ్రీను అనేక సార్లు అడగ్గా స్పందించకపోవడంతో ఇద్దరి మధ్య ధనియాలపేట రోడ్డు మీద ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కోపోద్రిక్తుడైన శ్రీను సతీష్‌పై దాడి చేయగా సంఘటన స్థలంలోనే సతీష్‌ కుప్పకూలి పడిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు సతీష్‌ను వెంటనే గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సతీష్‌ను పరిశీలించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కాగా సమాచారం అందుకున్న వన్‌టౌన్‌ సీఐ కె.ఇంద్రశ్రీనివాస్‌, ఎస్‌ఐ మాణిక్యాలరావు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించారు. అనంతరం సతీష్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సతీష్‌ అవివాహితుడు. దీనిపై సతీష్‌ తల్లి వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్‌ సీఐ కె.ఇంద్రశ్రీనివాస్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు