శఠగోపం!

29 Nov, 2023 01:44 IST|Sakshi
‘సెంటిమెంట్‌’ పేరిట

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అర్చకుడిని అంటూ పరిచయం పెంచుకుంటున్నారు.. దుర్గమ్మకు అలంకరించిన పట్టు చీర అంటూ నమ్మబలుకుతున్నారు.. ఇంట్లో పెట్టుకుంటే అంతా శుభమే జరుగుతుంది.. అనుకున్న పనులన్నీ జరిగిపోతాయంటూ సెంటిమెంట్‌ మాటలు వల్లెవేస్తున్నారు.. బుట్టలో పడుతున్న భక్తులు వేలకు వేలు సమర్పించుకుంటున్నారు.. ఆ తర్వాత అడిగినంత ఇవ్వకపోతే నష్టపోతారంటూ శాపనార్థాలు పెడుతూ చివరికి శఠగోపం పెడుతున్నారు.. ఈ తరహా మోసాలు ఇటీవల ఎక్కువయ్యాయి. తాజాగా ఇటువంటి ఘటనపై ఆదివారం హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తురాలి కుటుంబం దుర్గగుడి దేవస్థాన అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. అయితే తమను మోసం చేసిన వ్యక్తికీ దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేదని తెలుసుకుని వెనుదిరిగింది.

అసలేం జరిగిందంటే..

ఆదివారం హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అధికారులను కలిసేందుకు ప్రయత్నించింది. ఆ కుటుంబం మూడేళ్ల కిందట అమ్మవారి దర్శనానికి విచ్చేసిన తరుణంలో మహా మండపం దిగువన ఓ వ్యక్తి తాను దుర్గగుడి అర్చకుడినంటూ వారికి పరిచయం చేసుకున్నట్లు వివరించింది. ఆ కుటుంబానికి అమ్మవారి దర్శనం చేయించడమే కాకుండా వారి వద్ద నుంచి ఫోన్‌ నంబర్‌ ఇతర వివరాలను తీసుకున్నట్లు పేర్కొంది. అయితే ఆ తర్వాత కొంత కాలానికి ఆ వ్యక్తి హైదరాబాద్‌ వెళ్లి ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి ఫోన్‌ చేశాడు. తాను అమ్మవారికి అలంకరించిన ఓ పట్టుచీర మీ కోసం తీసుకువచ్చానని చెప్పడంతో ఆ కుటుంబం ఎంతో సంతోషించింది. అతను చీర కోసం వారి నుంచి రూ.30 వేలు వసూలు చేశాడు. మూడు నెలల కిందట మరో మారు ఆ కుటుంబానికి ఫోన్‌ చేసిన ఆ వ్యక్తి మరో చీర తీసుకువచ్చానని నమ్మించాడు. అయితే ఎక్కువ మొత్తంలో ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. అయితే అంత మొత్తం తమ వద్దని లేవని చెప్పడంతో ఆ కుటుంబాన్ని సెంటిమెంట్‌గా బెదిరింపులకు పాల్పడసాగాడు. రోజులో పది సార్లకు పైగా ఫోన్‌ చేయసాగాడు. దీంతో ఆ కుటుంబం ఆదివారం ఇంద్రకీలాద్రికి విచ్చేసి ఆలయ అధికారు లను ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఆ కుటుంబం నుంచి డబ్బులు తీసుకున్న వ్యక్తికి దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేదని తెలియడంతో వారు వెనుదిరిగారు. సోమవారం ఆ వ్యక్తి మరో మారు ఆ కుటుంబానికి ఫోన్‌ చేయడంతో వారు విషయాన్ని హైదరాబాద్‌లో పోలీసుల దృష్టికి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు.

గతంలోనూ ఈ తరహా మోసాలు..

గతంలో అమ్మ వారికి అలంకరించిన చీరలు లక్కీ డ్రా ద్వారా తక్కువకే ఇస్తున్నామంటూ ఏపీలోని పలు జిల్లాల్లో భక్తులకు ఫోన్‌ ద్వారా మోసం చేసేందుకు పలువురు ప్రయత్నించారు. ఇదే విధంగా ఆలయంలో ఉద్యోగం చేసే అధికారులు, సిబ్బందికి ఫోన్లు రావడంతో అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొంత మంది వేలల్లో డబ్బులు చెల్లించిన వారికి రూ.100 విలువైన చీరను కొరియర్‌ చేసిన సందర్భాలూ ఉన్నాయి. దీంతో దేవస్థానం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని బహిరంగంగా ఖండించడంతో ఈ తతంగానికి బ్రేక్‌ పడింది.

దుర్గమ్మకు అలంకరించిన చీరలంటూ నయా మోసం

ఏపీ, తెలంగాణలలో దుర్గమ్మ భక్తులకు కుచ్చుటోపీ ఆన్‌లైన్‌తో పాటు నేరుగా భక్తుల ఇంటికే వెళ్తున్న ప్రబుద్ధులు హైదరాబాద్‌ నుంచి దేవస్థానానికి వచ్చి ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబం అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు

దేవస్థాన ఆవరణలోనే విక్రయాలు

అమ్మవారికి సమర్పించిన చీరలకు కేవలం దేవస్థాన ఆవరణలోని కౌంటర్‌లోనే విక్ర యాలు జరుగుతాయి. ఎవరైనా కొరియర్‌ ద్వారా పంపుతామని చెప్పే మాయ మాటలు నమ్మొద్దు. అమ్మ వారి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చే మార్గంలో ఉన్న కౌంటర్‌లో భక్తులు స్వయంగా చీరలను సమర్పించి తగిన రశీదు పొందాలి. బయట లభించే చీరలు అమ్మవారికి అలంకరించినవి కావు.

– కె.ఎస్‌.రామారావు, ఈఓ, దుర్గగుడి

కేవలం దేవస్థానంలోనే..

అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలను దేవస్థాన ఆవరణలోనే విక్రయిస్తారు. రోజూ భక్తులు కాటన్‌, సిల్క్‌, పట్టుచీరలు అమ్మవారికి సమర్పిస్తుంటారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన ప్రతి చీరకు దేవస్థానం కౌంటర్‌లో రశీదు ఇస్తారు. విలువ కలిగిన పట్టుచీరను భక్తులు కోరిన రోజు అలంకరిస్తారు. అమ్మవారికి అలంకరించిన చీరల రశీదు నంబర్లను ఆలయ ప్రాంగణంలో ప్రదర్శిస్తారు. అనంతరం ఆ చీరను కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారు. కాంట్రాక్టర్‌ తీసుకున్న చీరను ఆలయ ప్రాంగణంతో పాటు ఘాట్‌రోడ్డులోని చీరల కౌంటర్‌లోనే విక్రయిస్తారు. భక్తులు సమర్పించిన చీరలను ఆన్‌లైన్‌లో విక్రయించడం కానీ, కొరియర్‌ ద్వారా తీసుకోవడం, పంపడం జరగవని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. అటువంటి ఆన్‌లైన్‌, టెలి మార్కెటింగ్‌ చేసినా భక్తులు నమ్మవద్దని సూచి స్తున్నారు. ఇటువంటి ఘటనల పట్ల అప్రమ త్తంగా ఉండటంతో పాటు ఎటువంటి సమాచారం కావాలన్నా, వివరాలు తెలుసుకోవాలన్నా దేవస్థాన టోల్‌ ఫ్రీ నంబర్‌(1800 42 9099)కు ఫోన్‌ చేయొచ్చని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు