కొనుగోళ్లకు ప్రాధాన్యం

29 Nov, 2023 01:44 IST|Sakshi
గోసాల డొంక రోడ్డులో ధాన్యం కాటా వేస్తున్న కూలీలు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా జిల్లాలో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు, తోట్లవల్లూరు, పమిడిముక్కల, గన్నవరం, పెడన ప్రాంతాల్లో ఇప్పటికే వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి పౌరసరఫరాల సంస్థ అధికారులు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. 317 రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయగా, ప్రస్తుతం 87 ఆర్బీకేల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయి. 1,685 మంది రైతుల నుంచి రూ.40.93 కోట్ల విలువైన 18,692.440 టన్నుల ధాన్యం సేకరించారు. ఇప్పటికే రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో రూ.8.23 కోట్ల నగదు జమ చేశారు. మరో రూ.18 కోట్ల బిల్లులను జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజరు ఆమోదించారు. మద్దతు ధర పొందేందుకు పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించారు. ధాన్యం సేకరణకు సంబంధించి గ్రామాల్లో పోస్టర్లు, కరపత్రాల ద్వారా రైతులకు విస్తృత ప్రచారం చేస్తున్నారు.

పకడ్బందీగా ఏర్పాట్లు

● జిల్లాలో మొత్తం 3,92,565 ఎకరాల వరి పంటను ఈ–క్రాప్‌లో నమోదు చేశారు. ఈ సమాచారం ఇప్పటికే వ్యవసాయ శాఖ నుంచి పౌర సరఫరాల సంస్థ అధికారులకు చేరింది.

● ఈ ఏడాది ఏ–గ్రేడ్‌ ధాన్యం క్వింటా మద్దతు ధర రూ.2,203, కామన్‌ రకం రూ.2,183గా ప్రభుత్వం నిర్ణయించింది.

● ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 10,52,907 టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా.

● ధాన్యం సేకరణ కోసం జిల్లా వ్యాప్తంగా 150 రైస్‌ మిల్లులను గుర్తించారు.

● ధాన్యం సేకరణకు 1.60 కోట్ల గోనె సంచులు అవసరమవుతాయని గుర్తించి, 10 కేంద్రాల్లో వీటిని నిల్వ చేశారు.

● ధాన్యం తూకం వేసేందుకు 44 వే బ్రిడ్జిలను గుర్తించారు.

● ధాన్యం రవాణా చేసే వాహనాలకు జీపీఎస్‌ అమర్చారు.

● రైతులే రవాణా వాహనాలను సమకూర్చుకోవచ్చు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏజెన్సీ, ఇతర వాహనాల ద్వారానూ ధాన్యంను మిల్లులకు రవాణా చేసుకోవచ్చు.

● రవాణా చార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ధాన్యం విక్రయించిన తరువాత 21 రోజుల్లోవ రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు.

● రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

కృష్ణా జిల్లాలో 3.92 లక్షల ఎకరాల్లో ఈ–క్రాప్‌ నమోదు 317 రైతు భరోసా కేంద్రాల్లోధాన్యం సేకరణకు ఏర్పాట్లు 18 వేల క్వింటాళ్లకు పైగా ధాన్యం కొనుగోలు ఇప్పటికే రైతులకు రూ.8.23 కోట్ల చెల్లింపు రాష్ట్ర ప్రభుత్వ చర్యలతోహర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

మరిన్ని వార్తలు