బహుజనుల జీవితాల్లో వెలుగు నింపిన జ్యోతీరావుపూలే

29 Nov, 2023 01:44 IST|Sakshi

చిలకలపూడి(మచిలీపట్నం): బహుజనులకు విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు మహాత్మాజ్యోతీరావు పూలే అని కలెక్టర్‌ పి.రాజాబాబు కొనియాడారు. తన చాంబర్‌ వద్ద వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జ్యోతీరావుపూలే వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి మంగళవారం ఓటర్ల నమోదు పరిశీలకుడు బి.శ్రీధర్‌తో కలిసి కలెక్టర్‌ రాజాబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. బాలికలు, సీ్త్రలకు విద్యను అందించిన సంఘ సంస్కర్త పూలే అన్నారు. జ్యోతీరావుపూలే ఆశయాలను భవిష్యత్‌ తరాలకు తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. బీఆర్‌ అంబేడ్కర్‌ తన గురువుగా పూలేను భావించారంటే ఎంతటి గొప్ప వ్యక్తో మనం గ్రహించాలన్నారు. సాంఘిక సంక్షేమశాఖ డీడీ షేక్‌ షాహెద్‌బాబు, బీసీ కార్పొరేషన్‌ ఈడీ కె.రాజేంద్రబాబు, బీసీ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పి.కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి నిత్యాన్నదానానికి 10 టన్నుల కూరగాయలు

పెనమలూరు: తిరుమల తిరుపతిలోని శ్రీవారి ఆలయంలో నిత్యాన్నదానానికి కూరగాయలు అందించటం పూర్వ జన్మ సుకృతమని భక్తులు బొప్పన కృష్ణ, మాధురీదేవి దంపతులు పేర్కొన్నారు. పోరంకి నుంచి మంగళవారం శ్రీవారి నిత్యాన్నదానానికి పది టన్నుల కూరగాయ లతో బయలుదేరిన లారీని దాతలు జెండా ఊపి ప్రారంభించారు. గతంలో కుటుంబరావు ఆధ్వర్యంలో శ్రీవారికి కూరగాయలు పంపేవారని పేర్కొన్నారు. ఆయన మరణానంతరం కుటుంబరావు మిత్రులు మండవ శ్రీనివాస్‌, నాగు, ధనేకుల సత్యనారాయణ సహకారంతో నిత్యాన్నదానానికి కూరగాయలు పంపుతున్నా మని తెలిపారు. బొప్పన మిధిలేష్‌, పునీత్‌, లక్ష్మి, సస్య పాల్గొన్నారు.

కర్రసాములో గన్నవరం విద్యార్థులకు పతకాలు

గన్నవరం: జాతీయ స్థాయి కర్రసాము పోటీల్లో గన్నవరం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు పతకాలు సాధించారని హెచ్‌ఎం డి.ఝాన్సీరాణి తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో పతకాలు సాధించిన విద్యార్థుల అభినందన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ.. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు విజయవాడలోని మాస్టర్‌ మైండ్‌ పాఠశాల ప్రాంగణంలో జరిగిన కర్రసాము పోటీల్లో తమ పాఠశాల విద్యార్థిని మానికొండ సత్యచిన్మయి అండర్‌ –14 విభాగంలో బంగారు, రజత, మాని కొండ సాయిప్రశాంత్‌ అండర్‌–12 విభాగంలో బంగారు, కాంస్య పతకాలు సాధించారని తెలిపారు. అనంతరం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను హెచ్‌ఎంతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.

దుర్గమ్మకు బంగారు వస్తువుల విరాళం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విశాఖపట్నంకు చెందిన సత్యనారాయణరెడ్డి, విజయ దంప తులు 47 గ్రాముల బంగారంతో బొట్టు, నత్తు, బులాకీలను సమర్పించారు. సత్యనారాయణరెడ్డి, విజయ దంపతులకు స్నేహితురాలైన దేవస్థాన పాలక మండలి సభ్యురాలు బచ్చు మాధవీకృష్ణ దంపతుల చేతుల మీదుగా ఆలయ ఈఓ కె.ఎస్‌.రామారావుకు మంగళవారం బంగారపు ఆభరణాలను అందజేశారు. సుమారు 20.8 గ్రాముల బంగారు రాళ్లబొట్టు, 15.8 గ్రాముల బంగారంతో నత్తు, 10.7 గ్రాముల బంగారంతో బులాకీలను తయారు చేయించి దేవస్థానానికి అందించారు. అనంతరం బచ్చు మాధవీకృష్ణ దంపతులకు అమ్మ వారి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలతో దాతలను ఈఓ రామారావు సత్కరించారు.

మరిన్ని వార్తలు