సామాజిక సాధికార యాత్రకు సన్నద్ధం

29 Nov, 2023 01:44 IST|Sakshi
నగరంలోని ప్రధాన రహదారి సెంట్రల్‌ డివైడర్‌కు ఏర్పాటు చేసిన బ్యానర్లు

మచిలీపట్నం టౌన్‌: వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర బుధవారం జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో జరగ నుంది. ఈ యాత్రలో పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, పార్టీ నాయకులు మునిసిపల్‌ కార్యాలయ సెంటర్‌లోని ప్రధాన రహదారిలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగున్నరేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా చేసిన మేలులను వివరించనున్నారు. సాధికార యాత్ర బహిరంగ సభలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రులు పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌, పేర్ని నాని, కర్నూలు, పామర్రు ఎమ్మెల్యేలు మొహమ్మద్‌ అబ్దుల్‌ హఫీజ్‌ ఖాన్‌, కైలే అనిల్‌కుమార్‌ ప్రసంగించనున్నారు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభ ప్రారంభమవుతుందని స్థానిక నాయకులు తెలిపారు. బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొంటున్న నాయకులకు స్వాగతం తెలుపుతూ వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జోనల్‌ ఇన్‌చార్జ్‌, ఎమ్మెల్యే పేర్ని నాని తనయుడు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) భారీ హోర్డింగ్‌, బ్యానర్లను నగరంలో ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని గ్రామాలతో పాటు నగరంలోని 50 డివిజన్ల నుంచి బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. సభకు విచ్చేయాలని కోరుతూ గ్రామాల, డివిజన్ల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఆహ్వాన పత్రికలను అందజేశారు. మూడు రోజులుగా ముమ్మరంగా మైక్‌ ప్రచారాన్ని నిర్వహించారు. నగరంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు ఈ బహిరంగ సభకు వచ్చి మద్దతిస్తామని ఇప్పటికే నాయకులకు తెలిపారు. ఈ సభకు నియోజకవర్గం నుంచి వేలాది మంది ప్రజలు తరలిరానున్నారు.

నేడు మచిలీపట్నంలో బస్సు యాత్ర మునిసిపల్‌ కార్యాలయం సెంటర్‌లో బహిరంగ సభ హాజరు కానున్న మంత్రి ధర్మాన,మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

మరిన్ని వార్తలు