టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీకి ఏర్పాట్లు పూర్తి

29 Nov, 2023 01:44 IST|Sakshi
మాట్లాడుతున్న ఏపీ టీటీ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు ప్రకాష్‌, విశ్వనాథరావు

విజయవాడ స్పోర్ట్స్‌: యూటీటీ నేషనల్‌ ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ –2023 నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు కె.వి.ఎస్‌. ప్రకాష్‌, పి.విశ్వనాథరావు తెలిపారు. ఈ నెల 29వ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి విజయవాడ పటమటలోని చెన్నుపాటి రామ కోటయ్య (సీహెచ్‌ఆర్‌కే) ఇండోర్‌ స్టేడియంలో ప్రారంభమయ్యే జాతీయ ర్యాంకింగ్‌ పోటీల్లో అండర్‌–11, 13, 15, 17, 19 బాలబాలికల జట్లు, సీనియర్‌ సీ్త్ర, పురుషుల జట్లు సింగిల్స్‌, డబుల్స్‌ విభాగాల్లో తలపడతాయని వివ రించారు. నగరంలోని సీహెచ్‌ఆర్‌కే ఇండోర్‌ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో చాంపియన్‌షిప్‌నకు సంబంధించిన వివరాలను వారు వివరించారు. డిసెంబర్‌ ఐదో తేదీ వరకు ఏడు రోజుల పాటు జరిగే ఈ పోటీలకు దేశ వ్యాప్తంగా 1,500 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు, టేబుల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా కార్యదర్శి కమలేష్‌ మెహతా ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఒక్కో రోజు ఒక్కో వయసు విభాగం పోటీలను పూర్తి చేసి బహుమతులు అందజేస్తామన్నారు. అన్ని వయసు విభాగాల్లోని విజేతలకు రూ.8.41 లక్షల నగదు బహు మతులు, ట్రోఫీలు, సర్టిఫికెట్‌లు అందజేస్తామన్నారు. టేబుల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా టెక్నికల్‌ ఆఫీసర్‌ గణేషన్‌ (కేరళ) పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు