అవేరా.. యువతకు వరం

29 Nov, 2023 01:44 IST|Sakshi
అవేరా సంస్థ ప్రతినిధులతో కలెక్టర్‌ ఢిల్లీరావు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ సమీపంలోని నున్న గ్రామం వద్ద రూ.100 కోట్లతో విద్యుత్‌ వాహనాల పరిశ్రమ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయడం అభినందనీయమని కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు అన్నారు. అవేరా సంస్థ చేస్తున్న వార్షిక స్కూటర్ల ఉత్పత్తి 25 వేల నుంచి లక్షకు పెరగనుందని, తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. అవేరా విద్యుత్‌ స్కూటర్ల తయారీ పరిశ్రమకు మంగళవారం ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి ఈ కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు, అవేరా సంస్థ ప్రతినిధులతో కలిసి ప్రత్యక్షంగా వీక్షించిన అనంతరం ఢిల్లీరావు మాట్లాడుతూ.. విజయవాడ సమీపంలో రూ.100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టి విద్యుత్‌ స్కూటర్లు తయారీ పరిశ్రమను నెలకొల్పేందుకు అవేరా సంస్థ ముందుకు రావడం నిరుద్యోగులకు వరమని పేర్కొన్నారు. నెడ్‌ క్యాప్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ జి.బుచ్చిరాజు, విజయవాడ రూరల్‌ మండలం వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ వై.నాగిరెడ్డి, అవేరా సంస్థ ప్రతినిధులు ఎ.సత్య, ఎ.కృష్ణ, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు

మరిన్ని వార్తలు