రెస్టారెంట్‌ ఫుడ్‌, వహ్వా! అనిపించే రుచి.. అయితే, వండేదంతా మంచి నూనె కాదు !

21 Mar, 2023 09:46 IST|Sakshi

కర్నూలు(హాస్పిటల్‌): మనం రోడ్డుపక్కన బండ్లో వేసే బజ్జీలు ఎంతో ఇష్టంగా నిలబడి మరీ తింటాము. అలాగే రెస్టారెంట్‌లకెళ్లి ఫ్రై ఐటమ్స్‌ లొట్టలేసుకుంటూ ఆరగిస్తాము. అప్పటి వరకు నోటి రుచికి అవి బాగానే ఉంటాయి. లోపలికి వెళ్లాక దానిని జీర్ణం చేయడానికి శరీరం పడే కష్టం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో అది పలు వ్యాధులకు గురవుతుంది. ఈ విషయం తెలియక చాలా మంది జిహ్వా రుచికి అలవాటు పడి కల్తీ నూనెతో తయారు చేసిన ఆహారాన్ని మరీ తింటున్నారు. కల్తీని నిరోధించాల్సిన ఫుడ్‌సెఫ్టీ అధికారులు ఆ విషయాన్నే మరిచిపోయినట్లు వ్యవహరిస్తున్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా 60 లక్షల లీటర్ల వంటనూనెను ప్రజలు వినియోగిస్తున్నట్లు అంచనా. జిల్లాలోని మూడు వేలకు పైగా ఉన్న దుకాణాల ద్వారా ఈ నూనె ప్రజలకు చేరుతోంది. గతంలో ఆహార నియంత్రణ విభాగం అధికారులు పలుచోట్ల దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో దాడుల తీవ్రత తగ్గించారు. ఆ తర్వాత కూడా నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారు.

గతంలో కర్నూలులోని జొహరాపురం రోడ్డుతో పాటు ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు, నంద్యాల, డోన్‌ ప్రాంతాల్లో వంట నూనెలను కల్తీ చేస్తుండగా అధికారులు సోదాలు నిర్వహించి కేసులు నమోదు చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ట్యాంకర్ల ద్వారా నూనెను తీసుకొచ్చి ఇక్కడి మిల్లుల్లో ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. మూడేళ్ల క్రితం కల్తీనూనెలపై దాడులు చేసిన అధికారులు మళ్లీ దాడులు చేయకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నామమాత్రపు తనిఖీలతో సరి
జిల్లాలో విచ్ఛలవిడిగా కల్తీనూనె విక్రయాలు జరుగుతున్నా ఆహార నియంత్రణ విభాగంలోని అధికారులు పట్టించుకోవడం లేదు. ఏడాదికి ఒకటి, రెండుసార్లు తనిఖీలు చేసి మమ అనిపిస్తున్నారు. వీరు అన్ని రకాల ఆహార శ్యాంపిల్స్‌ కలిపి నెలకు 12 తీస్తే చాలన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి ట్యాంకర్ల ద్వారా పలు ఆయిల్‌ మిల్లులకు కల్తీ వంట నూనె జిల్లాకు వస్తున్నా పట్టించుకోవడం లేదు. ఏ నాడూ నూనె మిల్లులకు వెళ్లి పరిశీలించి కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. ఆయా మిల్లుల్లో ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో మార్కెట్‌కు వచ్చినా అక్కడ కూడా వాటి శాంపిల్స్‌ సేకరించకపోవడంతో మార్కెట్‌లో కల్తీమాఫియా యథేచ్ఛగా చెలరేగిపోతోంది.

ఇలాంటి నూనెలు వాడాలి
మనం వాడే నూనెలో మోనో అన్‌ సాచ్యురేటెడ్‌, పాలి అన్‌ సాచ్యురేటెడ్‌, ఒమెగా 3 ఫ్యాటీ ఉండేటట్లు చూసుకోవాలి. ఈ మూడు ఏ ఆయిల్‌లో ఎక్కువ పరిమాణంలో ఉంటాయో అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇలాంటి ఆయిల్స్‌ వాడటం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌)ను తగ్గించి హెచ్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీనివల్ల గుండెకు మేలు కలుగుతుంది. రక్తనాళాలు పూడిపోవు.

బరువు పెరగరు. దీనివల్ల గుండెపోటు రిస్క్‌ బాగా తగ్గుతుంది. ఇవి శరీరంలో యాంటి ఇన్‌ఫ్లేమటరీగా కూడా పనిచేస్తాయి. మనం వాడే నూనెలో ఎక్స్‌ట్రా వర్జిన్‌ ఉండేటట్లు చూసుకోవాలి. వర్జిన్‌ అంటే ఎక్కువగా కెమికల్‌ ప్రాసెసింగ్‌ లేకుండా తయారు చేసినది. ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కొంచెం ధర ఎక్కువైనా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గానుగల్లో తయారైన నూనెలు ఈ తెగకు చెందినవి. వీటిలో వంటకు, ఆరోగ్యానికి సన్‌ఫ్లవర్‌, వేరుశనగ నూనె మంచివని వైద్యులు సూచిస్తున్నారు.

ఖరీదైన వంటనూనెల్లో కల్తీ
మార్కెట్‌లో బ్రాండెడ్‌ వంటనూనెలకు ఉన్న డిమాండ్‌ అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. మార్కెట్‌లో పేరున్న కంపెనీలను పోలిన బ్రాండ్‌ పోలికతో ముద్రించి నకిలీ నూనెలను విక్రయించి అమ్ముతున్నారు. మహారాష్ట్ర, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ట్యాంకర్ల ద్వారా వచ్చిన మార్గరిన్‌, పామాయిల్‌, హేజల్‌నట్‌ ఆయిల్‌ను వేరుశనగ, సన్‌ఫ్లవర్‌ ఆయిల్స్‌లో కలిపి వాటిని అందమైన ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. ఎక్కువగా ఇలాంటి వంటనూనెలను రోడ్డు పక్కన వ్యాపారం చేసే తోపుడు బండ్లు, చిరువ్యాపారులకు అంటగడుతున్నారు. ఈ నూనెలతో చికెన్‌, మటన్‌, ఫిష్‌ ఫ్రైలతో పాటు పలు రకాల బజ్జీలు, వడలు తయారు చేసి విక్రయిస్తున్నారు. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలోనూ ఇలాంటి నూనెనే వాడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. మార్కెట్‌ రేటు కంటే ఈ నూనె ప్యాకెట్లు సగం ధరకే లభిస్తుండటంతో వ్యాపారులు వాటిని కొని వ్యాపారం చేస్తున్నారు.

కల్తీ నూనెలతో జీర్ణకోశవ్యాధులు
కల్తీనూనెలను వాడటం ద్వారా జీర్ణకోశవ్యాధులు, స్థూలకాయం, క్యాన్సర్‌, పిత్తాశయంలో రాళ్లు ఏర్పడతాయి. ఎంత మంచి నూనె అయినా ఒకసారి వేడి చేసి వాడిన తర్వాత మళ్లీ వాడకూడదు. ఇలాంటివి హోటల్స్‌, రోడ్డుసైడు వ్యాపారుస్తులు ఎక్కువగా వాడతారు. నూనెను మళ్లీ వేడి చేసి వాడటం వల్ల దాంట్లో ఫ్రీ రాడికల్స్‌, ఆల్డిహైట్స్‌ తయారవుతాయి. ఇవి మనిషిలో వ్యాధి నిరోధకశక్తిని తగ్గించి అనేక వ్యాధులకు కారణమవుతాయి. మార్కెట్‌లో ఆయిల్‌ కొనేటప్పుడు ఏమేమి ఎక్కువగా ఉంటాయనేది ప్యాకెట్‌పై రాసి ఉంటారు. పాలి అన్‌ సాచ్యురేటెడ్‌ ఉన్నది చూసి కొనుగోలు చేయాలి. సాచ్యురేటెడ్‌ ఫ్యాట్‌, ట్రాన్స్‌ఫ్యాట్స్‌ ఉండేది కొనకూడదు.
–డాక్టర్‌ వెంకటరంగారెడ్డి, గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి, కర్నూలు ప్రభుత్వ వైద్యశాల

మరిన్ని వార్తలు