రోజురోజుకు పెరిగిపోతున్న నిమ్మ ధరలు

23 Mar, 2023 01:14 IST|Sakshi

ఆళ్లగడ్డ: రోజు రోజుకు నిమ్మ ధరలు పెరిగిపోతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ధరల్లేక.. ధర ఉన్నా ఆశించిన మేర దిగుబడి రాక నష్టాలు చవిచూసిన రైతులకు ఈ ఏడాది కలిసొచ్చింది. ప్రకృతి అనుకూలించడంతో ఏడాది పొడవునా మంచి కాపు కాస్తున్నాయి. డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు కాయ నాణ్యతను బట్టి బస్తా రూ.2000 నుంచి రూ.2200 వరకు ధర పలికింది. ప్రస్తుతం శుభకార్యాలు, పెళ్లిళ్లు, పండుగలు, జాతరలతో పాటు వేసవి గిరాకీ కూడా తోడు కావడంతో నిమ్మ ధరలు రెట్టింపు అయ్యాయి. గత 20 రోజుల నుంచి జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డ నిమ్మకాయల మార్కెట్‌ (మండీ)లో పండుగాయలు బస్తా (సుమారు 40 కిలోలు) రూ.3,800 నుంచి రూ.4,000 పలకగా.. పచ్చికాయ రూ.4,000 నుంచి రూ.4,500 వరకు వ్యాపారులు సవాల్‌ పాడుతున్నారు. రెండు నెలల నుంచి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఒక దశలో బెంగళూరు, చైన్నె, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో బస్తా రూ.8 వేలు వరకు చేరిందంటే నిమ్మ మార్కెట్‌ ఎంత జోరుమీదుందో అర్థమవుతుంది.

అంతర్జాతీయంగా డిమాండ్‌
ఆళ్లగడ్డ, చాగలమర్రి, రుద్రవరం, మహానంది, ప్యాపిలి, డోన్‌ మండాలాల నుంచి రోజు భారీగా నిమ్మకాయలు మినీ లారీలు, ఆటోలు, ట్రాక్టర్లలో ఆళ్లగడ్డ, నంద్యాల మార్కెట్‌లకు తరలివస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు రైతులతో మాట్లాడుకుని ఇద్దరు, ముగ్గురు రైతులవి కలిపి లారీలకు లోడ్‌ చేసి నేరుగా బెంగళూర్‌, చైన్నె, విజయవాడ, హైదరాబాద్‌, వైజాగ్‌, జైపూర్‌, మహారాష్ట్ర మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు. నిమ్మకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్‌ డిమాండ్‌ ఏర్పడటంతో అక్కడి నుంచి విదేశాలకు సైతం ఎగుమతి జరుగుతోంది.

రైతులకు నిఖరాదాయం
నిమ్మ ఏడాదికి మూడు కాపులు వస్తాయి. ఈ క్రమంలో ఏడాదిలో ఒక సీజన్‌లోనైనా మంచి ధర పలికితే చాలు అని గతంలో అనుకునేవారు. అలాంటిది మూడు సంవత్సరాలుగా సీజన్‌, అన్‌ సీజన్‌ అన్న తేడాలేకుండా నిమ్మకు డిమాండ్‌ ఉంటుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎకరా నిమ్మ సాగు చేసిన రైతు ఖర్చలు పోను రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు నిఖర ఆదాయం పొందుతున్నారు. గతంలో ఎకరాకు ఏడాది పొడువునా రూ.లక్ష వరకు వస్తే పెద్ద సంగతి. ఇందులో ఖర్చులు, పెట్టబడి పోను ఎకరాకు రూ.10 నుంచి రూ.20 వేలు మిగిలితే అంతే చాలు అనుకుని సంబరపడేవారు. అయితే ఈ సంవత్సరం ధర ఆశాజనకంగా ఉండటంతో మంచి ఆదాయం పొందుతున్నామని రైతులు చెబుతున్నారు.

ప్రభుత్వ ప్రోత్సాహం
ఆళ్లగడ్డ సబ్‌డివిజన్‌ పరిధిలో నిమ్మ సాగు ఏటికేడు విస్తారంగా పెరుగుతోంది. రైతులకు ప్రస్తుత ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. గత ప్రభుత్వం నామమాత్రంగానే రాయితీలు అందించింది. అదీకూడా టీడీపీ నాయకులకు, వారు సిఫార్సు చేసిన వారికి మాత్రమే హెక్టార్‌కు రూ.13 వేలు మంజూరు చేసేవారు. ప్రస్తుతం తోటల పుణరుద్ధరణ పథకం కింద ముదురు తోటలను తొలగించి చెట్లు నాటుకుంటే ఉద్యానశాఖ హెక్టార్‌కు రూ.17,700 రాయితీ అందజేస్తోంది. ఉపాధి హామీ పథకం కింద సన్న, చిన్నకారు రైతులకు నిమ్మ సాగుకు ప్రత్యేకంగా ప్రోత్సాహం లభిస్తోంది. ఎకరాకు ఏడాదికి రూ.50 వేల వరకు అందజేస్తున్నారు. సేద్యం ఖర్చులతో పాటు అంతర్‌ పంటల సాగుకు అయ్యే పెట్టుబడి కూడా ఉపాధి హామీలో అందిస్తోంది. వైఎస్సార్‌ జలకళ ద్వారా నిమ్మ తోటల్లో ప్రభుత్వం ఉచితంగా బోర్లు వేయిస్తోంది. ఇందు కోసం బోరు, కేసింగ్‌ పైపు, మోటరు, విద్యుత్‌ సౌకర్యం మొత్తం కలిపి ఒక్కో రైతుకు రూ.4 లక్షల వరకు ఖర్చు చేస్తోంది.

ధర పెరుగుతూ వస్తోంది
ఎకరా రూ.లక్ష ప్రకారం 3 ఎకరాలను కౌలుకు తీసుకున్నా. నెల నుంచి నిమ్మకాయకు ధర పెరుగుతూ వస్తోంది. గత రెండు కాపులు పెట్టుబడికి, కౌలుకు సరిపోయింది. డిసెంబర్‌లో వచ్చిన మంచుతో ప్రస్తుత కాపు కొంత మేర దెబ్బతినడంతో నష్టం వస్తుందని అనుకున్నాం. అయితే మార్కెట్లో ధర రోజురోజుకూ పెరుగుతుండటంతో లాభాలు వస్తున్నాయి.
– నారపురెడ్డి, కౌలు రైతు, కోటకందుకూరు

మరింత పెరిగే అవకాశం
గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాది పొడువునా నిమ్మ ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రకృతి అనుకూలించక పోవడంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో నిమ్మ కాపు సరిగా వచ్చినట్లు లేదు. అందుకే ధర బాగా పలికే అవకాశం ఉంది. ముఖ్యంగా జిల్లాలో ఆళ్లగడ్డ ప్రాంతంలోని భూములు, ఇక్కడి వాతావరణం నిమ్మసాగుకు బాగా అనుకూలం. ప్రస్తుతం వచ్చిన ఈదురు గాలులు, వడగండ్ల వర్షంతో అక్కడక్కడ నిమ్మ కాపు రాలిపోయింది. దీంతో ధర మరింత పెరిగే అవకాశం ఉంది. రైతులు జాగ్రత్తగా మార్కెటింగ్‌ చేసుకోవాలి.
– నాగరాజు, జిల్లా ఉద్యానశాఖాధికారి

మరిన్ని వార్తలు