Wife - Husband: క్షణికావేశంలో ఆలుమగల బలవన్మరణం

29 May, 2023 01:24 IST|Sakshi

కర్నూలు/ఆలూరు/దేవనకొండ: జీవితాంతం తోడునీడగా ఉంటామని బాస చేసి ఒక్కటైన దంపతులు బలవంతంగా ఈ లోకాన్ని వీడి వెళ్లారు. ఏడు నెలల కుమారుడిని ఒంటరి వాడిని చేశారు. దేవనకొండ మండలం గుడిమిరాళ్ళ గ్రామానికి చెందిన రంగనాయకులు (28) ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. ఈయనకు పత్తికొండ మండల చిన్నహుల్తి గ్రామానికి చెందిన లత (25)తో రెండేళ్ల క్రితం వివాహమైంది.

వీరికి ఏడు నెలల కుమారుడు ఉన్నాడు. రెండు రోజుల క్రితం రంగనాయకులు ఆస్తి విషయంలో భార్యతో గొడవ పడడంతో ఆమె క్షణికావేశానికి గురై శనివారం ఇంట్లో పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స అందించినా ఫలితం లేక ఆమె అదే రోజు అర్ధరాత్రి మృతి చెందింది. భార్య మరణం తట్టుకోలేక భర్త రంగనాయకులు మనస్తాపానికి గురై ఆదివారం తెల్లవారుజామున కర్నూలులోని కోట్ల రైల్వే స్టేషన్‌కు వెళ్లి రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రమాదంలో తలమొండెం వేర్వేరయ్యాయి.

అంతకుముందు తన దగ్గర ఉన్న రూ.50వేలు సోదరుడు బాలమురళికి అప్పజెప్పాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే ఎస్‌ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. మృతదేహం పక్కనే పడి ఉన్న సెల్‌ఫోన్‌ ఆధారంగా చిరునామా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేశారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. రంగనాయకులకు సంబంధించి రైల్వే పోలీసులు, లతకు సంబంధించి దేవనకొండ పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు