పులి కూనా.. అమ్మను వీడకు!

5 Jun, 2023 09:14 IST|Sakshi

ఆత్మకూరురూరల్‌: పులుల స్వర్గధామమైన భారతదేశంలో వాటి సంరక్షణకు ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి పొందాయి. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికారసంస్థ (ఎన్‌టీసీఏ) ప్రాజెక్ట్‌ టైగర్‌ను ఏర్పాటు చేసి పులుల సమీకృత సంరక్షణకు పాటు పడుతోంది. ఇంతటి మార్గదర్శకాలు ఉన్నప్పటికీ నల్లమలలో మాత్రం తరచూ పులికూనల మరణాలు సంభవిస్తుండటం అధికా రుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. తల్లి నుంచి తప్పిపోయిన పులికూనలు అధికారుల సంరక్షణలో చేరిన తర్వాత మరణిస్తుండటం అటవీ శాఖ పర్యవేక్షణ లోపాలను ఎత్తిచూపుతున్నాయి.

ఇటీవల ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని పెద్దగుమ్మడాపురం గ్రామ సమీపంలో తల్లిని వీడిన నాలుగు ఆడ పులికూనలను తిరుపతి జంతు ప్రదర్శన శాలకు చేర్చారు. వీటిని 108 అనే పులికి చెందిన కూనలుగా గుర్తించారు. పులి ప్రవర్దనంలో ఆడపులులే ప్రధాన పాత్ర వహించే సందర్భంలో ఒకే సారి నాలుగు ఆడకూనలు తల్లిని వీడటం జఠిలమైన సమస్యగా మారింది. వీటిని అత్యంత శాసీ్త్రయ పద్ధతులలో తల్లికి చేరువ చేయాల్సి ఉండగా అధికారుల వైఫల్యంతో తిరుపతి జంతు ప్రదర్శనశాలకు చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అక్కడ వీటిని వన్య జీవనానికి దగ్గరగా పెంచుతూ క్రమేపీ అడవిలో వదులుతామని అప్పట్లో అటవీ అధికారులు ప్రకటించారు. అప్పటి వరకు ప్రత్యేక ఎన్‌క్లోజర్ల్లలో ఉంచి పర్యవేక్షిస్తామని చెప్పిన జూ అధికారులు మూడు నెలలుగా వాటిని ఒక ఏసీ గదికే పరిమితం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో తీవ్రమైన ఆందోళనతో ఉన్న పులి కూనలలో ఒకదానికి చిన్నపాటి గాయ మైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. గాయం ఇన్ఫెక్ష న్‌ అయి అది ఇతర అవయవాలకు విస్తరించడంతో పులికూన మరణించినట్లు సమాచారం.

పులికూనలను త్వరలో నల్లమలకు తీసుకు రావాల ని ఇక్కడ అడవిలో ప్రత్యేకమైన ఎన్‌క్లోజర్‌లలో ఉంచాలని, ఆ మేరకు అనువైన అటవీ ప్రాంతాలను అధికారులు గుర్తించే క్రమంలో ఉండగా జూలో పులి కూన మరణించి స్థానిక నల్లమల అధికారులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో మిగిలిన మూడు పులికూనల భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

గతంలో మత్తు మందు వికటించి..
ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని వెలుగోడు పట్టణం శివార్లలోకి గతంలో రెండు పులికూనలు వచ్చాయి. అప్పట్లో కూడా ఈ కూనలు తల్లి నుంచి విడిపోయి జనారణ్యంలోకి వచ్చాయి. కాకపోతే అవి సంవత్సరం వయసు దాటిన కూనలు. వీటిని నేరుగా పట్టుకోవడానికి వీలు కాదు కాబట్టి వాటికి మత్తు ఇచ్చి బంధించారు. అయితే వాటిలో ఒక పులికూనకు పరిమితికి మించిన మత్తు ఇవ్వడంతో చనిపోయినట్లు అప్పట్లో పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. మిగిలిన రెండో పులికూన జూకు చేర్చారు.

మరిన్ని వార్తలు