సాఫ్ట్‌వేర్‌ అమ్మాయి కోసం అష్టకష్టాలు పడ్డారు.. ఎంగేజ్‌మెంట్‌ అయిన 6 నెలలకే..

31 Aug, 2023 13:46 IST|Sakshi

కర్నూలు: స్థిరపడటం అంటే.. బాగా డబ్బు సంపాదించడం, కారు, బంగ్లాలు ఉండటం ఒక్కటే కాదు.. పెళ్లి చేసుకున్నప్పుడే ఆ జీవితం సంపూర్ణమవుతుంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండటం, బంధుత్వాలకు విలువ ఇస్తుండటంతో పెళ్లి చేయాలనే ఆలోచన వస్తే చాలు.. ఎక్కడెక్కడ పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు ఉన్నారో, అబ్బాయిల వివరాలు ఇట్టే తెలిసిపోయేవి. క్షణాల్లో మాట కలపడం.. ఆ తర్వాత ముహూర్తాలు పెట్టేసుకోవడం, రెండు మనసులను ముడివేయడం చకచకా జరిగిపోయేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పెళ్లంటే.. తల్లిదండ్రులు ఒకస్థాయి యుద్ధం చేయాల్సిందే. కులం, గోత్రం.. జాతకం.. ఆస్తులు.. అంతస్తులు.. గుణగణాలు.. ఇవన్నీ తలుచుకుంటే గుండె పగిలినంత పనవుతుంది. సంబంధం చూడటం మొదలు.. పెళ్లి పూర్తయ్యే వరకు సవాలక్ష సవాళ్లు.     

కర్నూలు నగరానికి  చెందిన ఓ యువకునికి రెండేళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. వయస్సు 27 ఏళ్లు. తల్లిదండ్రులు పెళ్లి చేద్దామని నిర్ణయించుకొని అమ్మాయి కోసం వెతకటం మొదలుపెట్టారు. అయితే వెళ్లిన ప్రతిచోటా సొంత ఇల్లు ఉందా? భూమి ఎంతుంది? ఇలాంటి ప్రశ్నలే కానీ అబ్బాయి గుణగణాలు, కుటుంబ నేపథ్యం ప్రస్తావనే రాకపోవడం గమనార్హం. 

ఆళ్లగడ్డకు చెందిన ఓ యువకుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా బెంగళూరులో పని చేస్తున్నాడు. అమ్మాయి కూడా సాఫ్ట్‌వేర్‌ అయ్యుండాలనే నిబంధన పెట్టడంతో తల్లిదండ్రులు అష్టకష్టాలు పడి ఓ అమ్మాయితో ఆరు నెలల క్రితం ఎంగేజ్‌మెంట్‌ చేశారు. ఆ తర్వాత తాను ఎప్పుడు ఫోన్‌ చేసిన అమ్మాయి ఫోన్‌ ఎంగేజ్‌ వస్తుందనే కారణంతో ఈ బంధం అక్కడితో ముగిసిపోయింది. 

అరచేతిలో అన్వేషణ
పెళ్లిళ్ల పేరయ్యలు ఇప్పుడు బాగా తక్కువైపోయారు. ఒకప్పుడు చేతిలో ఒక బ్యాగు వేసుకొని, దాన్నిండా పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు, అబ్బాయిల ఫొటోలతో తెలిసిన వారి ఇళ్ల ముందు వాలిపోయేవాళ్లు. వీళ్లకు రూ.500, లేదా రూ.1000 ముందుగానే ఇచ్చుకుంటే సంబంధాలు వెతికిపెట్టేవాళ్లు. పెళ్లి సమయంలో కూడా వీళ్లకు అంతోఇంతో ముట్టజెబుతారు. ఇప్పుడు మ్యాట్రిమోనీ సైట్‌లు పుట్టగొడుగుల్లా తెరపైకి రావడంతో అరచేతిలో అన్వేషణ మొదలైంది. ఎవరికి వారు తమ ఫొటో, ప్రొఫైల్‌ అందులో పెట్టేస్తుండటంతో ఎంతవరకు సరైన వివరాలు ఇచ్చారనే విషయం అంతుచిక్కని పరిస్థితి. 

పిల్లలు పెద్దవాళ్లు అవుతుంటే సంతోషంగా ఉంటుంది. ఉద్యోగాలు సంపాదిస్తే ఇక భయం లేదనిపిస్తుంది. ఆ తర్వాత వయస్సు గుర్తుకు వస్తే మాత్రం తల్లిదండ్రులకు కంటి మీద కునుకు దూరమవుతుంది. ఆధునిక ప్రపంచంలో అమ్మాయి, అబ్బాయిల్లో మొదట జీవితంలో స్థిరపడాలనే భావన అధికంగా కనిపిస్తుంది. ఆ తర్వాత పెళ్లి అనడం పరిపాటిగా మారింది. ఈ కోవలో చదువు పూర్తయ్యే సరికి సుమారు 25 ఏళ్లు వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత ఉద్యోగంలో కుదురుకోవాలంటే మరో ఐదేళ్లు ఆవిరి కావాల్సిందే. కొందరు త్వరగానే దారిలో పడుతున్నా.. చాలా వరకు అమ్మాయిలు, అబ్బాయిలు చదువు, ఉద్యోగం వెంట పరుగులు తీస్తూ తమ వయస్సు కరిగిపోతుందనే విషయాన్నే మర్చిపోతున్నారు.

తీరా ఉద్యోగం వస్తే.. అప్పుడు పెళ్లి ఆలోచన మొదలైనా తల్లిదండ్రులు వేట మొదలు పెడితే అప్పటికి కానీ అర్థం కావట్లేదు ముదిరిపోయామని. వయస్సు ఎంత? ఈ ప్రశ్న అవతలి వైపు నుంచి వస్తే చాలు ఇక పెళ్లి కావడం కష్టమనిపిస్తుంది. ఇక ఆ తర్వాత కూడా గొంతెమ్మ కోర్కెలతో కాలం గిర్రున తిరుగుతుంది. ఒక్కో సంవత్సరం గడిచేకొద్దీ పెళ్లి అయితే చాలన్నట్లుగా తయారవుతుంది వ్యవహారం. 

పిల్లలు చెప్పినట్లు వినాల్సిందే.. 
గతంలో తల్లిదండ్రులు ఓ సంబంధం చూసి పెళ్లి చేసుకోమంటే మారు మాట్లాడకుండా పీటలు ఎక్కేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. పెద్దల మాట కంటే.. పిల్లల అభిరుచికే ప్రాధాన్యం ఉంటోంది. ఒకరికొకరు నచ్చాలి. మాటామాట కలవాలి. డిన్నర్లు, డేటింగ్‌లు.. తలుచుకుంటే బుర్ర గిర్రున తిరుగుతుంది. ఇక కులగోత్రాలు, జాతకాలు సరేసరి. చదువు, ఉద్యోగ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండటం.. అన్నీ సరిపోయాయి అనుకున్నా చివరి నిముషంలో ఏదో ఒక వెలితి బయటకు రావడంతో ఆ సంబంధం అక్కడితో ముగిసిపోతుంది. ఇలా వాళ్ల కోర్కెలకు అనుగుణంగా సంబంధాలు వెతికేందుకు తల్లిదండ్రులు చుక్కలు చూడాల్సి వస్తోంది. అతి కష్టం మీద సబంధం తీసుకొచ్చినా సాకులు చెప్పడంతో వ్యవహారం మళ్లీ మొదటికొస్తుంది. ఈ కారణంగా పెళ్లిళ్లు ఆలస్యమవుతుండటంతో ఇంట్లో సంతోషం ఆవిరవుతుంది. 

ఏజెంట్‌ వ్యవస్థ 
ఉన్న ప్రాంతాల్లో కోరుకున్న సంబంధాలు కుదరక ఇతర ప్రాంతాలకూ వెళ్తున్నారు. చివరకు కులాల ప్రస్తావన మర్చిపోయి సంబంధం దొరికితే చాలు అనుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకోసం శ్రీకాకుళం, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా తదితర ప్రాంతాల్లోనూ కాళ్లకు బలపాలు కట్టుకుని తిరుగుతున్నారు. పెళ్లి కొడుకు తరపున అమ్మాయికి భరణం చెల్లించి మరీ సంబంధం కుదుర్చుకుంటున్నారు. శ్రీకాళుళం పరిసర ప్రాంతాల నుంచి సంబంధం కుదిర్చేందుకు ఏకంగా ఏజెంట్‌ వ్యవస్థ ఏర్పాటైంది. రూ.2లక్షల నుంచి రూ.3లక్షల మేర వీళ్లకు ముట్టజెబితే కానీ సంబంధం దొరకని పరిస్థితి. 

అబ్బాయిల తల్లిదండ్రుల్లోనే ఆందోళన 
అసలే అమ్మాయిల కొరత. అబ్బాలు చదువు, ఉద్యోగం అని కాలం గడిచే కొద్దీ వయస్సు పెరిగి, అందుకు తగిన అమ్మాయి దొరక్క తల్లిదండ్రులు చుక్కలు చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమకు అబ్బాయి పుట్టాలని కోరుకోవడం కూడా ఇందుకు కారణమవుతోంది. ఇదే సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పెళ్లి సంబంధం రాగానే.. అబ్బాయికి ఉద్యోగంతో పాటు భూములు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండిటికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 

డబ్బుకు ప్రాధాన్యం 
ఒకప్పుడు పెళ్లంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలనేవాళ్లు. అంతేకాదు.. గుణగణాలను తెలుసుకునేందుకు ఎవరెవరినో విచారించే పరిస్థితి. ఇప్పుడు ఆ ఊసే కరువవుతోంది. అమ్మాయి దొరకడమే కష్టమవుతుండటంతో అటువైపు నుంచి కూడా ధోరణి మారిపోయింది. అబ్బాయి మంచివాడా, కాదా అనే విషయాలను పక్కనపెట్టి ఆస్తులు, అంతస్తులపైనే దృష్టి సారిస్తున్నారు. పైగా ఒక్కడే కొడుకు ఉంటే మంచిదనే భావన అమ్మాయి తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. ఉద్యోగంతో పాటు పొలం ఉన్న ఇంటికి తమ అమ్మాయిని పంపేందుకే ఇటీవల కాలంలో ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 

ఆ రెండు కులాల్లో అమ్మాయిలు 10 శాతమే.. 
మ్యారేజ్‌ బ్యూరోలకు వచ్చే తల్లిదండ్రులు అబ్బాయికి లక్ష జీతం, 10 ఎకరాల పొలం ఉండాలని చెప్పడం పరిపాటిగా మారినట్లు తెలుస్తోంది. మరికొందరు ఉద్యోగం దొరికే వరకు వేచి చూస్తుండటం కూడా పెళ్లిళ్లు ఆలస్యం అవడానికి కారణమవుతోంది. ప్ర స్తుతం రెండు కులాల్లో అమ్మాయిల కొరత ఎక్కువగా కనిపిస్తోంది. ఎంతలా అంటే.. వంద మంది అబ్బాయిలకు 10 మంది అమ్మాయిలు మాత్రమే ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఈ కారణంగా ఓ కులం అబ్బాయిలు ఇతర కులాల అమ్మాయిలు అయినా పర్వాలేదనే నిర్ణయానికి వచ్చేశారు. 

 30 ఏళ్ల తర్వాతే.. 
పెళ్లి వయస్సు బాగా పెరిగిపోతుంది. అబ్బాయి, అమ్మాయి జీవితంలో స్థిరపడటానికే అధిక ప్రా ధాన్యత ఇస్తున్నారు. ఈ కారణంగా 30 ఏళ్ల తర్వాత కానీ పెళ్లిళ్లు జరగడం లేదు. పెద్దల మాటకంటే, తమకు నచ్చితేనే పెళ్లి చేసుకుంటామని చెప్పడం కూడా ఆలస్యానికి కారణమవుతోంది. – చిన్న వెంకటేశ్వర్లు, 
ఓపిక మ్యారేజ్‌ బ్యూరో, కర్నూలు 

పెళ్లికాని ప్రసాదులే.. 
సాధారణంగా అమ్మాయిలు వయస్సుకు రాగానే తల్లిదండ్రుల్లో పెళ్లి ఆలోచన మొదలవుతుంది. చదువు పూర్తి అవుతుందనగానే ఆ లోపు తగిన వరుడిని వెతికే పనిలో ఉంటారు. అయితే అబ్బాయిలు మాత్రం చదువుతో పాటు ఉద్యోగంలో స్థిరపడాలనే భావనతో వయస్సునే మర్చిపోతున్నారు. ఈలోపు ఆ వయస్సు అమ్మాయిలకు పెళ్లిళ్లు అయిపోతుండటంతో అబ్బాయిల పరిస్థితి గందరగోళంగా మారుతోంది. వయస్సుకు తగిన అమ్మాయిలు దొరక్క, ఉన్నా వాళ్ల తల్లిదండ్రుల ముందుజాగ్రత్త ప్రశ్నలతో పెళ్లికాని ప్రసాదులుగానే మిగిలిపోతున్నారు. కొన్ని కులాల్లో అమ్మాయిల కొరత అధికంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎదురు కట్నం ఇచ్చి కూడా పెళ్లి చేసుకుంటున్నారు.  

వయస్సులో జరుగుతున్న పెళ్లిళ్లు అంతంతే.. 
పెళ్లి వయస్సు అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు. ఈ వయస్సులో జరుగుతున్న పెళ్లిళ్లు ఇప్పుడు దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. పట్టణాల్లో ఈ వయస్సు పెళ్లిళ్లు చాలా అరుదు. చదువు, ఉద్యోగం అనుకోవడంతోనే వయస్సు చేజారిపోతుంది. ఈ కారణంగా పెళ్లిళ్లు ఆలస్యమవుతూ ఒకరినొకరు అర్థం చేసుకోలేక గొడవలకు దారితీస్తుంది. ఇరువురి వయస్సులో వ్యత్యాసం కూడా సగం పెళ్లిళ్లను విడాకుల వరకు తీసుకెళ్తోంది.   

మరిన్ని వార్తలు