రైలు నుంచి జారిపడి మృత్యువాత

4 Dec, 2023 01:48 IST|Sakshi

వెల్దుర్తి(కృష్ణగిరి): వేగంగా వెళ్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. రైల్వే ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు... ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని గోవావ జిల్లా, నాగవ జైత్పూర్‌ గ్రామానికి చెందిన దిపక్‌గౌండ్‌(30)తోపాటు ఇతని స్నేహితులు రాహుల్‌గౌర్‌, చంద్రకేష్‌ యాదవ్‌లు బతుకుదెరువు కోసం లక్నో నుంచి యెశ్వంత్‌పూర్‌కు నవంబర్‌ 30న ట్రైన్‌ నెంబర్‌ 22684లో ప్రయాణం చేస్తున్నారు. ఈ నెల 2న వెల్దుర్తి నుంచి బోగోలు స్టేషన్ల మధ్యలో రైలు వెళ్తున్న సమయంలో దిపక్‌గౌండ్‌ స్వీపర్‌ నుంచి చెత్త బ్యాగ్‌ను తీసుకుని బయటకు వేసే సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడిపోయాడు. వెంటనే స్నేహితులు చైన్‌ లాగి రైలును ఆపారు. బలమైన రక్తగాయాలు కావడంతో బోగోలు స్టేషన్‌ మాస్టన్‌ వెంటనే 108లో డోన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు సర్వజన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

>
మరిన్ని వార్తలు