ఆదోనిలో ఐదిళ్లలో చోరీ

4 Dec, 2023 01:48 IST|Sakshi
బీరువాలోని వస్తువులను చెల్లాచెదురుగా పడేసిన దృశ్యం
● రూ.3 లక్షలు నగదు, 22 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాల అపహరణ

ఆదోనిఅర్బన్‌: పట్టణంలోని తిరుమలనగర్‌, బాబాగార్డెన్‌ కాలనీల్లో ఆదివారం తెల్లవారుజామున ఐదిళ్లల్లో చోరీ జరిగింది. రూ.3 లక్షలు నగదు, 22 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలు, 25 వేలు విలువ చేసే ఒక సెల్‌ఫోన్‌ను అపహరించారు. బాధితులు పోలీసులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రిటైర్డ్‌ ఆర్టీసీ కండక్టర్‌ శివరామిరెడ్డి ఈనెల 1వ తేదీన ఇంటికి తాళం వేసి బెంగళూరులో ఉన్న కుమార్తె ఇంటికి వెళ్లారు. అదే అదునుగా భావించి ఇంటి, బీరువా తాళాలు పగలగొట్టి రూ.86 వేలు నగదు, 10 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు శివరామిరెడ్డి కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా గోపాల్‌రెడ్డి, విశ్వనాథ్‌ శెట్టి గుంతకల్‌లోని కసాపురం ఆంజనేయస్వామి దర్శనం కోసం శనివారం సాయంత్రం వెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున గోపాల్‌రెడ్డి ఇంటిలోని బీరువా తాళాలను పగలగొట్టి రూ.50 వేలు నగదు, రెండు తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. విశ్వనాథ్‌శెట్టి ఇంట్లో రూ.4 వేలు నగదు దోచుకెళ్లారు. సీఆర్‌పీఎఫ్‌ ఉద్యోగి గురురాజా భార్య స్రవంతి ఆదోనిలోని అమ్మ ఇంటికి వెళ్లింది. ఆమె ఇంటి, బీరువా తాళాలను పగలగొట్టి రూ.60 వేలు నగదు, రూ.25 వేలు విలువచేసే ఒక సెల్‌ఫోన్‌ను దొంగలించారు. సాకరే పద్మావతి వారం రోజులక్రితం ఇంటికి తాళం వేసి కూతురు ఇంటికెళ్లింది. ఆమె ఇంట్లో రూ.లక్ష నగదు, 10 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్‌ టీంను రప్పించి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు