వైభవంగా మల్లన్న కల్యాణం

4 Dec, 2023 01:48 IST|Sakshi
ప్రత్యేక అలంకరణలో స్వామి అమ్మవార్లు

శ్రీశైలంటెంపుల్‌: ధర్మ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి నెల్లూరు వీఆర్‌సీ గ్రౌండ్‌లో శ్రీశైల మల్లికార్జున, భ్రమరాంబ కల్యాణోత్సవం కనులపండువగా సాగింది. ఈ కల్యాణోత్సవంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ముందుగా అర్చకస్వాములు కల్యాణోత్సవ సంకల్పాన్ని పఠించారు. అనంతరం కల్యాణం నిర్విఘ్నంగా జరగాలని గణపతి పూజ జరిపించి,స్థల శుద్ధి కోసం పుణ్యాహవచనం చేశారు. అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీతం, కన్యావరణ మంత్రాలు పఠించారు. స్వామివారికి మథుపర్కం సమర్పించి స్వామిఅమ్మవార్లకు వస్త్రాలను సమర్పించి, బాషికధారణ చేశారు. అనంతరం గౌరీపూజ, స్వామిఅమ్మవార్ల మధ్య తెరసెల్లను ఏర్పాటు చేసి మహాసంకల్పం పఠనం చేశారు. అనంతరం సుముహూర్తం సమయంలో స్వామిఅమ్మవార్లకు జీలకర్ర, బెల్లం సమర్పించి, మాంగల్య పూజను జరిపించి మాంగల్యధారణ జరిపించారు. అనంతరం తలంబ్రాలు, బ్రహ్మముడి కార్యక్రమాలను జరిపి భక్తులకు తీర్ధప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు సి.మధుసూదన్‌రెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ జి.రవి, అర్చకులు, వేదపండితులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు