మొదటి విడతలో 11 మందికి ఆటోలు...

5 Dec, 2023 05:28 IST|Sakshi

కర్నూలు(అగ్రికల్చర్‌): అవకాశాలను అందిపుచ్చుకోవడంలో అతివలు ముందుంటున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కాలంతోపాటు పోటీ పడుతూ రయ్‌..రయ్‌ అని బతుకు బండిలో దూసుకుపోతున్నారు. మగవారికి సైతం కష్టంగా అనిపించే ఆటో డ్రైవర్‌ వృత్తిని ఎంచుకుని ఆత్మస్థైర్యంతో సాగుతున్నారు. మహిళల ఆసక్తిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలను మరింత మెరుగు పరిచేందుకు వడ్డీ లేకుండా రుణ సదుపాయం కల్పిస్తోంది. ఇందుకోసం డీఆర్‌డీఏ–వైకేపీ ద్వారా ఉన్నతి పథకాన్ని అమలు చేస్తోంది.

మొదటి విడతలో 11 మందికి ఆటోలు...

డీఆర్‌డీఏ–వైకేపీ అమలు చేసే పథకాల్లో ‘ఉన్నతి’ కీలకమైనది. ఎస్సీ, ఎస్టీ మహిళల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఈ పథకం కింద వడ్డీలేని రుణాలు ఇస్తున్నారు. తీసుకున్న రుణాలు వాయిదాల పద్ధతిలో చెల్లించాల్సి ఉంది. ఈ పథకం కింద ఉన్నతి.. మహిళా శక్తి.. ఆటో రిక్షా పేరుతో ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మొదటి విడతలో 11 మంది మహిళలకు పూర్తి ధరలో 90 శాతం మొత్తాన్ని రుణంగా మంజూరు చేశారు. డ్రైవింగ్‌ వచ్చి లైసెన్స్‌ కలిగి ఆటో నడపడంపై ఆసక్తి ఉన్న మహిళలకు అవకాశం ఇచ్చారు. తొమ్మిది బజాజ్‌ కంపెనీ, రెండు అప్పీ కంపెనీకి చెందిన ఆటోలు పంపిణీ చేస్తున్నారు. కల్లూరు మండలంలో ఐదుగురు, కర్నూలు మండలంలో ఇద్దరు, ఆలూరు, కోడుమూరు, సి.బెళగల్‌, గోనెగండ్ల మండలాల్లో ఒక్కొక్కరికి ప్రకారం ఆటోలు మంజూరు చేశారు. ఆటోల పూర్తి ధర రూ.32,58,078 ఉండగా. మహిళలు 10 శాతం మొత్తం అంటే రూ.3,48,018 భరించారు. సెర్ప్‌లో ప్రత్యేక విభాగమైన ఉన్నతి కింద రూ.29,10,060 రుణ సదుపాయం కల్పించారు. రుణంగా పొందుతున్న మొత్తాన్ని మహిళలు 48 వాయిదాల్లో వడ్డీలేకుండా చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ మహిళలకు వరం

షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన మహిళలు తమకు ఆసక్తి ఉన్న వృత్తులో రాణించేందుకు ఉన్నతి పథకం చక్కగా తోడ్పడుతోంది. ఈ పథకం కింద రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తున్నారు. 2022–23లో దాదాపు 3,000 మంది మహిళలకు రూ.16 కోట్లు రుణాలుగా పంపిణీ చేశారు. 2023–24లో 2,275 మంది మహిళలకు రూ.12 కోట్లు వడ్డీలేని రుణాలుగా పంపిణీ చేయాలనేది లక్ష్యం. ఇప్పటి వరకు 1,104 మందికి రూ.5.56 కోట్లు పంపిణీ చేశారు. నూతనంగా ఉన్నతి.. మహిళ శక్తి... ఆటోరిక్షా కార్యక్రమం కింద స్వయం సహాయక సంఘాల్లో ఉన్న 11 మంది మహిళలకు ఆటోలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

>
మరిన్ని వార్తలు