హజ్‌ యాత్రకు దరఖాస్తుల ఆహ్వానం

5 Dec, 2023 05:28 IST|Sakshi
మహానందిలోని గరుడనంది వద్ద జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్‌. శ్రీనివాసరావు

కర్నూలు(రాజ్‌విహార్‌): హజ్‌ యాత్ర–2024కు దరఖాస్తులను ఆహ్వానిస్తూ హజ్‌ కమిటీ ఆఫ్‌ ఇండియా నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు రాష్ట్ర హజ్‌ కమిటీ సభ్యుడు హఫీజ్‌ మంజూర్‌ అహ్మద్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది మక్కాలో హజ్‌, మదీనా యాత్రకు వెళ్లేందుకు ఆసక్తి ఉన్న ముస్లింలు డిసెంబర్‌ 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుతో పాటు పాస్‌ పోర్టు జిరాక్స్‌ కాపీ, ఆధార్‌, బ్లడ్‌ గ్రూప్‌ సర్టిఫికెట్‌, పాస్‌ పోర్టు సైజ్‌ ఫొటోలు–2, బ్యాంక్‌ అకౌంట్‌, కోవిడ్‌–19 సర్టిఫికెట్‌ కాపీలు జతచేయాలన్నారు. వివరాలకు 94402 32564 నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక

పంపిణీకి నేడు ఆఖరు

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాలో డిసెంబర్‌ నెల వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. పంపిణీ మంగళవారం కూడా కొనసాగనుంది. వృద్ధాప్య, వికలాంగులు, హెల్త్‌ పింఛన్లు పొందుతున్న వారిలో 60 ఏళ్లు పైబడిన వారు వేలిముద్రలు, ఐరిష్‌ నమోదు కాని పింఛనుదారులు ఆర్‌బీఐఎస్‌ ముఖ గుర్తింపు ద్వారా పింఛను పొందవచ్చు. ఇతర కేటగిరీలకు చెందిన పింఛనుదారులు విధిగా 3 సార్లు వేలిముద్రలు, ఐరిష్‌ నమోదుకు విధిగా ప్రయత్నం చేయాల్సి ఉంది. మూడుసార్లు కూడా ఫెయిల్‌ అయితే ఆర్‌బీఐఎస్‌ ముఖ గుర్తింపు ద్వారా పింఛను పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి కర్నూలు జిల్లాలో 2,45,320 పింఛన్లు ఉండగా 2,40,320 మందికి.. నంద్యాల జిల్లాలో 2,21,508 పింఛన్లు ఉండగా 2,17,724 పింఛన్ల పంపిణీ పూర్తయింది.

మహానందీశ్వరుడి సేవలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి

మహానంది: జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్‌. శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా సోమవారం మహానందీశ్వరస్వామిని దర్శించుకున్నారు. కార్తీకమాసం, మూడవ సోమవారం సందర్భంగా నవనంది క్షేత్రాల సందర్శనలో భాగంగా మహానంది వచ్చిన ఆయనకు ఆలయ ఈఓ కాపు చంద్రశేఖర్‌రెడ్డి స్వాగతం పలికారు. ఈ మేరకు వారు శ్రీ కామేశ్వరీదేవి, మహానందీశ్వరస్వామి, శ్రీ వినాయక నందీశ్వర స్వామి, గరుడనందీశ్వర స్వామి వార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించారు.

ఇన్‌పుట్‌ సబ్సిడీ

నివేదిక సిద్ధం

కర్నూలు(అగ్రికల్చర్‌): కరువు మండలాల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించేందుకు అవసరమైన నివేదికను జిల్లా వ్యవసాయ యంత్రాంగం సిద్ధం చేసింది. జిల్లాలో 26 మండలాలు ఉండగా తుగ్గలి, కర్నూలు రూరల్‌ మండలాలు మినహా మిగిలిన 24 మండలాలను ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా గుర్తించింది. కరువు మండలాల్లో ప్రతి రైతుకు 2 హెక్టార్ల వరకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించనుంది. కరువు రైతులకు మేలు చేసేలా ప్రభుత్వం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ మార్గదర్శకాలను సవరించింది. వ్యవసాయ పంటలకు సంబంధించి 2,90,741 మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ లభించనుంది. ఈ రైతులకు సంబంధించి 2,38,231.42 హెక్టార్లకు రూ.368,36,27,080 ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించేలా వ్యవసాయ యంత్రాంగం నివేదిక సిద్ధం చేసింది. నివేదికను కలెక్టర్‌ సృజ న ద్వారా ప్రభుత్వానికి పంపుతున్నట్లుగా జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్‌ వరలక్ష్మి తెలిపారు. ఉద్యాన పంటలకు సంబందించి ఇన్‌పుట్‌ సబ్సిడీ నివేదిక తయారీ మంగళవారం ఉదయానికి కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

డ్వామా విజిలెన్స్‌

అధికారిగా భాస్కర్‌

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లా నీటి యాజమా న్య సంస్థ విజిలెన్స్‌ ఆఫీసర్‌గా జి.భాస్కర్‌ నియమితులయ్యారు. నంద్యాల పట్టణానికి చెందిన ఈయన గోస్పాడు ఎంపీడీవోగా పనిచేస్తూ ఇటీవల డీఎల్‌డీవోగా పదోన్నతి పొందారు. పదోన్నతిపై ప్రభుత్వం డ్వామా విజిలెన్స్‌ అధికారిగా నియమించింది. ఈ మేరకు సోమవారం ముందుగా ప్రాజెక్టు డైరెక్టర్‌ అమరనాథరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఉపాధి పనులకు సంబంధించి సామాజిక తనిఖీలను మరింత పకడ్బందీగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

>
మరిన్ని వార్తలు